తెలంగాణలో 70.74 శాతం పోలింగ్.. రీ పోలింగ్ కు అవకాశం లేదు

– భువనగిరిలో అత్యధికం, హైదరాబాద్‌లో అత్యల్పం..

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురువారం జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించడం కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి వికాస్‌రాజ్‌ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 70.74 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో పోలింగ్‌ 3 శాతం తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు.
రాష్ట్రంలో డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో లక్షా 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని, 80 ఏండ్లు పైబడిన వారికి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించామని అన్నారు. ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం, హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. ఇక నియోజక వర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్‌పురాలో 39.6 శాతం పోలింగ్‌ నమోదైందని వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. చాలా చోట్ల రాత్రి 9.30 వరకు పోలింగ్‌ జరిగిందని తెలిపారు. ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెకిస్తారని, ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈసారి ఓటర్లలో 18, 19 ఏండ్ల వయసున్న వారు 3.06 శాతం ఉన్నారన్నారు.

Spread the love