”గణతంత్ర దినోత్సవం వచ్చిందిరో… మూగవాడు కంఠాల మోగించెనోహో… తలలెత్తి దివిదాకా ఎలుగెత్తుమోహో.. స్వాతంత్య్ర వీరులను స్మరియింపుమోహో” మైకులో నుంచి వినబడుతున్న పాటకు ప్రతిఒక్కరిలో దేశ భక్తి పొంగిపొరలుతోంది. ఇంకాసేపట్లో జెండా వందనం కార్యక్రమం జరగబోతోంది. ప్రధానోపాద్యాయుడు ఏర్పాట్ల గురించి టీచర్స్‌కి సూచనలిస్తున్నాడు. బడి ప్రాంగణంలో పిల్లలందరూ వారివారి తరగతుల వరుసల్లో నిలబడుకొని ఉన్నారు. యూనిఫార్మ్స్ ధరించి చేతిలో చిన్న చిన్న జెండాలు పట్టుకుని తెల్లటి పావురాల్లా మెరిసిపోతున్నారు.
మైకులో వచ్చే పాటకు అనుగుణంగా పి. టి. సారు గోవర్ధన్ పిల్లలచేత జెండాలు ఊపిస్తున్నాడు. తన పక్క వరుసలో నిలబడి నవ్వుతూ జెండాను ఊపుతున్న అబ్దుల్లాని చూస్తుంటే కైలాష్‌కి ఒంటికి కారం రాసుకున్నంత మంటగా ఉంది. కోపం వస్తోంది. ద్వేషం కూడా పుడుతోంది. కైలాష్ మనసులో ఉండేవేమి తెలియని అబ్దుల్లా నవ్వుతూ కైలాష్ వంక చూస్తున్నాడు. ”నువ్వు నా పక్కన నిలబడద్దు. దూరంగా పో” అరిచాడు కైలాష్. బిక్కమొఖం వేసుకుని దూరంగా పోయి నిలబడ్డాడు అబ్దుల్లా. వాళ్లిద్దరూ నాలుగవ తరగతి చదువుతున్నారు. ఒకేవీధిలో పక్కపక్క ఇళ్ళలోనే ఉంటారు కైలాష్, అబ్దుల్లా. ఎన్నో ఏళ్ళుగా వాళ్ళిద్దరి కుటుంబాలు స్నేహంతో కలిసిమెలిసి ఉండేవారు.
సంక్రాంతికి కైలాష్ వాళ్ళు అరిసెలు, సకినాలు చేసి అబ్దులా వాళ్ళకి ఇస్తే, రంజాన్ నాడు షీర్ కుర్మా, సేమియా హాల్వా కైలాష్ కుటుంబానికి ఇవ్వకుండా తినేవారు కాదు అబ్దుల్లా తల్లిదండ్రులు. అలాంటిది ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడడంలేదు. స్నేహం స్థానంలో ద్వేషం పుట్టుకొస్తోంది. ఆ మధ్య కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత కోపం, ద్వేషం, భయం, అభద్రతాభావం చాలామందిలో పెరిగిపోయాయి. అబ్దుల్లా, కైలాష్ కుటుంబాలు కూడా వాటికి అతీతం కాదు. క్రమంగా వాళ్ళ మధ్య స్నేహం పలుచబడుతూ వచ్చి, ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడింది. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకునే విషయాలు, టి. వి. లాంటి సోషల్ మీడియాలో స్వార్ధపూరిత మతోన్మాద శక్తుల మాటలు, అవకాశం, పాలకుల అతిశయాలు ముస్లింల పట్ల కైలాష్ మనసుని కలుషితం చేసాయి. పాలకుండ లాంటి స్నేహంలో అరాచకశక్తులన్నీ కలిసి ద్వేషం అనే విషపు చుక్కని కలిపేసాయి.
జెండా వందనం కార్యక్రమం అయిపోయింది. టీచర్స్ ఇచ్చిన మిఠాయిలు తింటూ, పిల్లలందరూ ఇంటిదారి పట్టారు. కైలాష్, అబ్దుల్లా కూడా ఇళ్ళకు వచ్చారు. ఇద్దరి ఇళ్ళకు తాళాలు వేసి ఉన్నాయి. ఏం చేయాలో తోచక ఇద్దరూ ఎడమొఖం, పెడమొఖంగా వాళ్ళ ఇంటి అరుగుల మీద కూర్చుని, అమ్మానాన్నలు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఓ గంట గడిచింది. మెల్లగా సంధ్యచీకట్లు ముసురుకుంటున్నాయి. కైలాష్, అబ్దుల్లా ఇద్దరికీ ఆకలేస్తోంది. అమ్మ, నాన్నలు ఎక్కడికెళ్ళారో తెలియక భయం కూడా కలుగుతోంది. అయినా సరే ఒకరినొకరు పలకరించుకోకుండా వీధివైపు చూస్తూ కూర్చున్నారు. కాసేపటికి కైలాష్ వాళ్ళ ఇంటి ముందుకు ఓ క్యాబ్ వచ్చి ఆగింది. ఆ వెనుకే ఒక ఆటో కూడా వచ్చింది. కైలాష్ అమ్మ రేవతి, అబ్దుల్లా వాళ్ళమ్మ జుబేదా బేగం ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని దిగారు. రేవతి ఇంటి తాళం తీసి, తలుపు తెరిచింది. క్యాబ్‌లో నుంచి అబ్దుల్లా వాళ్ళ అబ్బాజాన్ రెహమాన్ దిగాడు. తర్వాత మెల్లగా కైలాష్ తండ్రి నారాయణని పట్టుకుని మెల్లగా కారునుంచి దింపి, తన భుజం ఆసరాగా పెట్టి నారాయణ భుజం చుట్టూ చేయి వేసి, మెల్లగా ఇంట్లోకి నడిపించుకుంటూ వచ్చాడు.
నారాయణ కాలుకి పెద్ద కట్టుకట్టి ఉంది. కైలాష్, అబ్దుల్లా బిత్తరపోయి చూస్తున్నారు. నారాయణను మెల్లగా మంచం మీద పడుకోబెట్టాడు రెహమాన్. రేవతి గబగబా కాఫీ పెట్టి అందరికీ ఇచ్చింది. కాఫీ తాగారు. నారాయణ వాడాల్సిన మందుల గురించి చెప్పి, ఇక బయలుదేరుతాం అన్నారు రెహ్మాన్, జుబేదా బేగం. ”రెహ్మాన్ భారు ఇలా నా దగ్గరకి రా” మెల్లగా అన్నాడు నారాయణ. రెహ్మాన్ వచ్చి నారాయణ చేతులు పట్టుకున్నాడు. అతని చేతిని గుండెలకు ఆనించుకుంటూ ”రెహ్మాన్ భారు.. ఈ రోజు నువ్వు దేవుడిలా వచ్చి నన్ను కాపాడావు. లేకుంటే నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుమీద పడిఉన్న నా ప్రాణాలు అక్కడే పోయేవి. నేను నిన్ను ఎంత ద్వేషించినా నువ్వు మనసులో పెట్టుకోకుండా నన్ను ఆపదలో ఆదుకున్నావు. నీ ఋణం తీర్చలేనిది రెహమాన్ భారు” ఆవేదనగా కన్నీళ్ళు పెట్టుకున్నాడు నారాయణ. ఆడవాళ్ళు ఇద్దరూ కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
”అయ్యో.. నువ్వు అవేమి మనసులో పెట్టుకోకు నారాయణ భారు. మనం మనం ఒకటి. చిన్నప్పటి నుంచి ఈ వీధిలోనే ఉన్నాం. ఇక్కడపుట్టి ఇక్కడే పెరిగాం. ఏవో దుష్ట అరాచక ఉగ్రవాద శక్తులు, మనల్ని రెచ్చగొట్టి, పచ్చగా ఉండే మనదేశాన్ని, మన మధ్యనుండే అన్నదమ్ముల అనుబంధాన్ని ముక్కలు చేయాలనీ చూసారు. అలాంటి వారిని పట్టించుకోకుండా, మనమంతా ఒకటే అని మనం నిరూపించుకోవాలి. ఇన్నేళ్ళు కలిసిమెలిసి ఉన్నాం. నీ స్కూటర్ని లారీ ఢ కొట్టి, వేగంగా వెళ్ళిపోయింది. అప్పుడే నేను అటువైపు వచ్చాను. రక్త గాయాలతో ఉన్న నిన్ను వదిలి ఎలా వెళతాను చెప్పు. ఎన్ననుకున్నా మనం మనం ఒకటే. అందుకే, నిన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాను. ఇంకెప్పుడు మన మధ్య పొరపొచ్చలు రావు. ఎప్పటిలా మనం కలిసిమెలిసి ఉందాం” రెహ్మాన్ స్వరంలో ఉద్వేగం.
రేవతి, జుబేదా బేగం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు చెమ్మతేలిన కళ్ళతో. విషయమంతా అర్ధమైనట్లు కైలాష్, అబ్దుల్లా ఒకరిచేతులు ఒకరు పట్టుకుని, ఒకరికళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు స్నేహంగా, ప్రేమగా…
రోహిణి వంజారి, 9000594630



