న్యూఢిల్లీ : ప్రఖ్యాత షూటర్, కోచ్ జస్పాల్ రాణా (49) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్ ఈయన కోచింగ్‌లోనే రాటుదేలిన సంగతి విదితమే. రాణా సోదరడు సుభాష్ వెల్లడించిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్‌లో భాగంగా ఇటీవల జర్మనీ నుంచి భారత్‌కు తిరిగివస్తుండగా రాణా అనారోగ్యానికి గురయ్యారు. విమానం దిగిన వెంటనే ఆయనను ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ రాణా ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో ఉండగానే జస్పాల్‌కు ఛాతినొప్పి, అసౌకర్యం కలిగాయి. ఎసిడిటిగా పొరబడి.. తన పనిలో నిమగ్నమయ్యారు. అయితే భారత్‌కు వచ్చేటప్పుడు మళ్లీ అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారని సుభాష్ తెలిపారు. ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఎఐ) ధ్రువీకరించింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్హవాల్‌లో 1976లో జన్మించిన రాణా..తన 12 ఏటలోనే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకాన్ని సాధించారు.
అనంతరం 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. 1994-2006 మధ్యకాలంలో పలు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని 15 పతకాలు సాధించారు. 2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్..మువ్వన్నెల పతకాను అంతర్జాతీయ క్రీడా వేదికపై రెపరెపలాడించారు. కోచ్‌గా కూడా ఆయన ఎనలేని సేవలందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు గెలిచిన మను బాకర్‌కు రాణాయే వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించారు. గతంలో జాతీయ జూనియర్ కోచ్‌గా వ్యవహరించారు. అప్పుడే మను బాకర్, సౌరభ్ చౌదరి లాంటి ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి వచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్‌గా నియమితులయ్యారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. క్రీడారంగానికి ఆయన అందించిన సేవలకు గాను 2020లో ప్రభుత్వం ద్రోణాచార్య పురస్కారంతో సత్కరించింది. కాగా జస్పాల్ రాణా రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నారు. తొలుత బిజెపిలో ఉన్న ఆయన 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి..అందులోనే కొనసాగుతున్నారు.
జస్పాల్ రాణా కన్నుమూత
- Advertisement -
- Advertisement -



