Sunday, June 14, 2026
E-PAPER
Homeకథఅమ్మప్రేమ

అమ్మప్రేమ

- Advertisement -

అమ్మమ్మ జానకమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతున్న అమత ఉలిక్కిపడి లేచేలా…..
ఆ పసి గుండెను భయమనే అంధకారంలోకి నెట్టే తన కన్నతల్లి లహరి పిలుపు…
”ఏ అమృత లే… మన ఇంటికి వెళ్ళాలి. ఎంతసేపు అమ్మమ్మ ఒడిలో పడుకున్నా నీకు తనివి తీరదు. అక్కడ బస్సుకి టైం అవుతుంది. రేపటితో నీ ఎండాకాలం సెలవులు పూర్తవుతాయి. ఎల్లుండి నుంచి మళ్లీ స్కూలు మొదలవుతుంది. ఈరోజు వెళితే గాని రేపు స్కూల్‌కి కావాల్సినవన్నీ షాపింగ్‌ చేసుకోగలుగుతాం.”
”నీ ఫ్రెండు శ్రీనిధి దగ్గర ఉన్న బ్యాగు నచ్చిందని చెప్పావంటగా అమ్మమ్మతో! నీకూ అలాంటి బ్యాగు కొంటాను. అది ఎక్కడ దొరుకుతుందో ఏమో.! మళ్లీ దానికోసం మాల్స్‌ చుట్టూ తిరగాలి.” అంటూ అమృతని లేపటానికి దగ్గరికి వస్తుంది లహరి.
అమ్మ అడుగులు తన వైపుగా వస్తున్నాయని గమనించిన అమత భయంతో అమ్మమ్మను ఇంకా గట్టిగా హత్తుకుంది. ఆ చిన్నారి అమ్మమ్మ చీరను తన చేతులకి చుట్టుకొని, ఇక నన్ను అమ్మమ్మ దగ్గర నుంచి ఎవరు విడదీయలేరు అనే అందమైన భ్రమలో ఉంది. ఆ పసిప్రాణానికి జానకమ్మ ఒడి సేప్‌ ప్లేస్‌.
ఇక్కడ నుంచి వెళితే మళ్ళీ మా అమ్మ పెట్టే పోటీ ప్రపంచంలో తోలుబొమ్మనైపోవాలి, అనుకొని మెలకువగా ఉన్నా కూడా కళ్ళు తెరవడానికి ఇష్టం లేక నిద్రలో ఉన్నట్టుగానే నటిస్తోంది అమత. అది నటన కాదు, ఆ పసి గుండె ఎటువంటి భయం లేకుండా కొట్టుకునే ఒకే ఒక ఆప్యాయతల లోగిలి అమ్మమ్మ ఒడి. ఆ చంటి పిల్ల కోరుకునే స్వేచ్ఛా ప్రపంచం.
ఆ ఎండాకాలపు సెలవుల కోసం సంవత్సరం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది అమృత. ఎందుకంటే తనకు ఎంతగానో ఇష్టమైన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొచ్చని.
***
అమ్మమ్మతో పంచుకోవాలనుకున్న మాటలన్నీ, ఆడుకోవాలనుకున్న ఆటలన్నీ ముందుగానే ఒక పుస్తకంలో రాసుకుంటుంది. సెలవులన్ని రోజులు అమ్మమ్మ దగ్గర ఎంతో ఆనందంగా గడుపుతుంది. అమ్మమ్మ చేసే ప్రతి పనిని క్షుణ్ణంగా గమనించటం, అమ్మమ్మ మాటలలో.. చేతి స్పర్శలో ప్రేమను ఆస్వాదించటం అమతకి ఎంతో ఇష్టం.

ఉదయం లేచినప్పటి నుంచి అమ్మమ్మ వెనకాలే తిరగటం, మనసుకు నచ్చింది చేస్తూ.. అమ్మమ్మ ఎంతో ప్రేమగా చేసి పెట్టింది తింటూ.. కావలసినట్టు ఉంటూ.. ఆటా-పాటా, ఆనందం, సంతోషం అనుభవించే అమ్మమ్మ ఒడి వదిలి వెళ్లాలంటే ఇష్టం లేక, ఆ చిందర వందర గందరగోళ ప్రపంచంలోనికి వెళ్లలేక కళ్ళు తెరవలేక పోతుంది అమత. అమ్మమ్మా… ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వవా?” అని అడగాలనిపిస్తోంది. కానీ అడిగేంత ధైర్యం లేదు..
అమ్మ లహరి ఇంకా దగ్గరగా వస్తుంది. అమత గుండె భయంతో వణికి పోతుంది. రెండు కళ్ళు గట్టిగా మూసుకుంది. మూసిన కళ్ళలో నుంచి కారుతున్న నీరు గుండె పగిలి చెరువై పారుతుందా అన్నట్టుగా ఉంది. అది గమనించిన జానకమ్మ అమతని దగ్గరగా అదిమి పట్టుకుని, ‘ఏడవకు అమ్మడు, మళ్లీ సెలవుల్లో వస్తావుగా, ఈసారి దసరా సెలవులకు కూడా వద్దువు గాని’ అంటూ అమత మనసు స్థిమిత పరచటానికి ప్రయత్నించింది.
అమతకు అమ్మమ్మ మాటలు అసలు వినిపించడం లేదు. ఇక్కడ నుంచి అమ్మతో తన ఇంటికి వెళ్లాక జరిగే సంఘటనలు తన కళ్ళ ముందు మెదులుతూ భయపెడుతున్నాయి.
షషష
నిద్ర లేపటానికి అమ్మ అరుపులు.. ”ఏ అమృతా..! లే.. లేచి రెడీ అవ్వు. స్కూలుకు లేట్‌ అవుతుంది. బ్రష్‌ అయిందా.? ఇంకా ఎంతసేపు ఆ బాత్రూంలో ఉంటావు.”
ఆ బాత్రూం నాలుగు గోడల మధ్యలో ఒంటరిగా ఉన్న కాసేపైనా అమ్మకి దూరంగా ఉండొచ్చు అని.
”ఈరోజు బయటకు వస్తావా అసలు? టిఫిన్‌ చల్లారిపోతుంది.”
అమ్మ అరుపులు వింటూ బిక్కు బిక్కుమని బయటకు వచ్చిన అమృత తన తల్లి చూపులో కఠినత్వాన్ని చూసి, రెండు నిమిషాలలో రెడీ అయ్యి టేబుల్‌ దగ్గరికి వచ్చేసి, రోజూ లాగే ఇష్టం లేని ఇడ్లీలను బలవంతంగా నోటిలో కుక్కుకొని, స్కూల్‌ బ్యాగ్‌, లంచ్‌ బాక్స్‌ తీసుకుని ఇంకా 20 నిమిషాలలో వచ్చే బస్సు కోసం వెళ్లి ముందుగానే రోడ్డుమీద ఎదురుచూస్తూ ఉండాలి.
స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ల భయం. పుస్తకాలతో యుద్ధం. మార్కుల కోసం పోరాటం. మార్కులు బాగా వచ్చినా, రాకపోయినా ఒకే రకంగా ప్రవర్తించే అమ్మ.
స్కూల్‌ నుంచి వచ్చాక ‘అమృత ఫ్రెష్‌ అవ్వు, ఇంకా ఎంతసేపు తింటావ్‌? త్వరగా కంప్లీట్‌ చేసి బుక్స్‌ తీసి చదువు, ఈరోజు టెస్ట్‌ లో ఎన్ని మార్కులు వచ్చాయి? నీ ఫ్రెండ్స్‌ అందరికంటే నీకు ఎక్కువ వచ్చాయి కదా! టెస్ట్‌ పేపర్‌ చూపించు’.
మార్కులు బాగా వస్తే గుడ్‌.. కీప్‌ ఇట్‌ అప్‌. లేకపోతే కోపంతో సంతకం పెట్టడానికి ఇచ్చిన పేపర్‌ ని చించేస్తుంది. క్లాసులో టీచర్‌ కి ఏం చెప్పాలో అర్థం కాక రాత్రి అంతా ఏడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అది గమనించిన లహరి ‘లేట్‌ అయింది పడుకో.. ఇంకా ఎంతసేపు ఏడుస్తావ్‌?’ కోపంగా.
ఇలాంటి మాటలు తప్ప, ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా మాట్లాడటం, అమ్మమ్మలా కొసరి కొసరి గోరుముద్దురు తినిపించడం.. ప్రేమగా దగ్గరికి తీసుకోవటం అమత ఏరోజూ చూడలేదు.
ఎప్పుడైనా అమ్మ బయటకు వెళ్లినప్పుడు అమ్మ చున్నీ కట్టుకుని, తనను తానే అద్దంలో చూసుకుంటూ అమ్మలా ఊహించుకుని అమ్మతో చెప్పాలనుకున్నవన్నీ చెప్పుకునేది.
అమ్మ చేతి స్పర్శ కోసం పాపం తహతహలాడిపోయేది. కొన్నిసార్లు అమ్మ డ్రెస్సులు వేసుకొని అమ్మను కౌగిలించుకున్నట్టు ఫీలవుతూ ఆనందపడేది. అది అమ్మ ఎక్కడ చూస్తుందోనని తనని తాను దుప్పటితో కప్పేసుకునేది.
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మొదలయ్యే భయం అమత మనసులో రాత్రి పడుకునే వరకు క్షణక్షణం పెరుగుతూ ఆ పసిపాపని ఉక్కిరి బిక్కిరి చేసేది. ఆ భయాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక, ఎవరికీ చెప్పలేక, తనలో తాను బాధపడుతూ కొన్నిసార్లు ఆ భయం వల్ల కడుపులో భరించలేని నొప్పి వచ్చినా కూడా అమ్మకి చెబితే ఏమంటుందో?
ఎప్పటిలాగే.. ”సైలెంట్‌ గా పడుకో. చిన్నపిల్లలకి ఏ నొప్పులూ ఉండవు” అని చిరాకు పడుతుందనే ఆలోచనతో చెప్పలేక ఆ చిన్ని మనసు ఒంటరి తనంతో తన పక్కనే ఉన్న బొమ్మని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ పడుకున్న నిద్రలేని రాత్రులు ఎన్నో..
షషష
లహరి ఇంకా ముందుకు వచ్చి తన చేతిని అమత మీద పెట్టబోయింది.
అమృత ఒళ్ళంతా చెమటలతో తడిసి చల్లబడిపోయింది. ఆ చిన్న చేతులు ఇంకా అమ్మమ్మ చీర కొంగునే గట్టిగా పట్టుకున్నాయి. జానకమ్మకి మాత్రం ఆ పట్టు వెనుక దాగున్న భయం స్పష్టంగా అర్థమవుతోంది. ”లహరి..” అని మెల్లగా పిలిచింది జానకమ్మ.
”ఏంటమ్మా?” అంటూ గంభీరంగా అడిగింది లహరి.
”పాపని కాస్త ప్రేమగా పెంచమ్మా.. తనతో అంత కటువుగా ఉండకే. పాప హదయం తల్లిలో ప్రేమను చూడాలి కాని.. అమ్మను చూడాగానే భయంగా ముడుచుకుపోకూడదు లహరి’.
లహరి ఒక్కసారి ఆగి జానకమ్మ వైపు చూసింది. ”నేను ఏమైనా తప్పుగా పెంచుతున్నానా అమ్మ? తన భవిష్యత్తు బాగుండాలని కష్టపడుతున్నాను. ప్రకాష్‌ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయినా, నేను ఏరోజూ అమతకి ఆ లోటు తెలియకూడదని, అది నాలా సెంటిమెంటల్‌ ఫూల్‌ అవ్వకూడదని, స్ట్రాంగ్‌ గా ఉండాలని నా జీవితంలోని సంతోషాన్ని కూడా పణంగా పెట్టి ఇంత కఠినంగా ఉంటున్నా. అమృత అంటే నాకు ప్రేమ లేక కాదు.”
లహరి సమాధానంలోని లోతును, బాధను అర్థం చేసుకున్న జానకమ్మ నిట్టూర్పుతో చిన్నగా నవ్వి..
”భవిష్యత్తు కోసం వర్తమానం పోగొట్టుకోవడం సరైంది కాదమ్మా. నీ జీవితంలో ఏదో జరిగిందని చంటి పాపతో నువ్వు ఇలా ఉండటం తనకే కాదు నీకు కూడా మంచిది కాదు లహరి. ఎవరో నిన్ను దూరం చేశారని, నీ కడుపును పుట్టిన పాపని నీ ప్రేమకి దూరం చేసి, నీ కఠినత్వానికి దగ్గర చేస్తూ.. నీ మీద భయాన్ని పెంచుతున్నావు. ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి భయపడుతుంది. అదే రేపు పెద్దయ్యాక నిన్ను అసహ్యించుకుంటుంది. నీకు తన అవసరం ఉన్న రోజు, నువ్వు తన ప్రేమ కావాలనుకున్న రోజు.. అది నీకు అందనంత దూరానికి వెళ్ళిపోతుంది” కొంత మౌనం తర్వాత…
”చూడమ్మా లహరి ”పిల్లలకి మంచి స్కూల్‌, మంచి మార్కులు, మంచి బ్యాగులు మాత్రమే కాదమ్మా.. వాళ్లు భయపడకుండా ఉండగలిగే ఒక ఒడి కావాలి. అది కచ్చితంగా తల్లి ఒడే అవ్వాలి.”
దానికి లహరి ”తల్లిని అర్థం చేసుకోని కూతురు ఉంటుందేమో కానీ, కూతురిని ప్రేమించని తల్లి ఎక్కడా ఉండదమ్మా.”
”అవును. నువ్వు అమతను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కానీ, తెలియాల్సింది నాకు కాదు లహరి, ఆ పసి దానికి. చూడు నీతో రావాలంటే ఎలా వణికి పోతుందో! ఒకసారి అమతని ముట్టుకొని చూడు చెమటలు పట్టేసి ఎంత చల్లగా అయిందో. ఈ భయంతో ఆ పసి గుండెకు ఏమైనా అయితే అది నీ జీవితంలో పూడ్చలేని గాయం అవుతుంది. గుర్తుపెట్టుకో లహరి.”
ఆ మాటలు లహరి మనసులో ఎప్పుడో రాయి లాగా మారిన తల్లి తనాన్ని మేలుకొలిపాయి. అక్కడే నిస్సహాయంగా కూర్చుండి పోయింది. జానకమ్మ అమత తల నిమురుతూ.. ”పాప నీతో మాట్లాడటానికి కూడా భయపడుతోంది లహరి. నువ్వు ఆలోచించేది తప్పు కాదు.. కానీ అమతతో నువ్వు ప్రవర్తించే విధానం ఈ చిన్న గుండెకి యుద్ధంలా అనిపిస్తోంది.” అంది.
లహరి మౌనంగా జానకమ్మ ఒడిలో పడుకున్న అమత పాదాలు నిమురుతుంది.
ఆమెకి ఒక్కసారిగా గుర్తొచ్చింది. అమత చిన్నప్పుడు కింద పడి మోకాలుకు దెబ్బ తగిలినా ఏడుస్తూ తన దగ్గరకు రాకుండా, కబోర్డులోని ఆయింట్మెంట్‌ తీసి రాసుకుని, తన గదిలోకి వెళ్లి పడుకుంది.
క్లాసులో ఫస్ట్‌ వచ్చిన రోజుకూడా భయంగానే రిపోర్టు కార్డు తను చూసేటట్టుగా పక్కనే పెట్టి వెళ్ళేది. కానీ, సంతోషంతో తల్లి చేతికి ఇచ్చేదికాదు. రాత్రిళ్లు నిద్రలో ఉలిక్కిపడి లేచేది. ఇవన్నీ లహరి ”పిల్లల అలవాట్లు” అనుకుని వదిలేసింది. కానీ ఇప్పుడు.. అమ్మమ్మ ఒడిని వదిలి, తల్లి దగ్గరకు రావాల్సి వస్తోందనే ఆలోచనకే వణికిపోతున్న కూతురిని చూసి, తన పెంపకంలో ప్రేమ కంటే ఒత్తిడే ఎక్కువ ఉందని అర్థమైంది.
లహరి మెల్లిగా అమత దగ్గరకు వచ్చి, అమత పాదాలని గట్టిగా పట్టుకుని ముద్దాడింది. ఈసారి తన స్పర్మలో కఠినత్వం, గంభీరత్వం లేవు. కూతురుపైన అపారమైన ప్రేమ తప్ప.
అమత మాత్రం ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కూతురు పరిస్థితిని అర్థం చేసుకున్న లహరి అమృతకి దగ్గరగా వెళ్లి, అమత తలను ఎంతో ప్రేమగా నిమిరింది.
”అమృత..” ప్రేమగా పిలిచి, ”పోనీ ఇంకో రెండు రోజులు అమ్మమ్మ దగ్గరే ఉంటావా?”
ఎంతో సంతోషంతో కళ్ళు తెరిచిన అమత తన తల్లి కళ్ళలో ఇన్నాళ్లుగా తను కోరుకుంటున్న ప్రేమను చూసి, ఆనందంతో మళ్లీ అమ్మమ్మను గట్టిగా వాటేసుకుంది.
”కానీ ఒక కండిషన్‌..” అంది లహరి, కూతురు సంతోషాన్ని చూసి కళ్ళలో నుంచి వస్తున ఆనందభాష్పాలను తుడుచుకుంటూ.. చిరునవ్వుతో.
అమత గుండెలో మళ్లీ భయం మొదలైంది. అమ్మ ఏం కండిషన్‌ పెడుతుందోనని. అమ్మమ్మ వైపు జాలిగా చూసింది.
”ఇకపై అమ్మమ్మతో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండాలి. నీకేం చెప్పాలని ఉన్నా భయపడకుండా నాకు చెప్పాలి. ఏం తినాలని ఉన్నా నన్ను అడగాలి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. ఏడుపొచ్చినా, సంతోషం వచ్చినా నాతో పంచుకోవాలి. రోజూ స్కూల్‌ కి వెళ్లేటప్పుడు హగ్‌ చేసి ముద్దు పెట్టి వెళ్ళాళి. ముఖ్యంగా రోజూ నా ఒడిలో పడుకోవాలి”.
తల్లి మాటలు వినగానే అమృత అమ్మమ్మను గట్టిగా పట్టుకుని తన గుండెలోని భారమంతా తీరేలా ఏడ్చింది. భయంతో కాదు.. ఎంతోకాలంగా ఎదురుచూసిన అమ్మ ప్రేమ తనకి దక్కిందన్న ఆనందంతో…


సుదేష్ణాదేవి జంగంగారి, 9177938246

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -