Sunday, June 14, 2026
E-PAPER
Homeకవిత'దృక్పథం' జడపదార్థం కాదు

‘దృక్పథం’ జడపదార్థం కాదు

- Advertisement -

కవి, కథకులు, పాత్రికేయులు ‘కంచర్ల శ్రీనివాస్‌ ఉరఫ్‌ సూఫీ శ్రీనివాస్‌’ పరిచయం అక్కర్లేని సాహితీవేత్త. నివాసం ఖమ్మం. కవిత్వమైనా, కథ అయినా తనదైన ముద్ర కలిగిన సజనకారుడు. ‘దృక్పథం’ విషయంలో ఒక చర్చ అవసరమనిస్తది. కవులకు చలనరహితమైన ‘దృక్పథం’ మాత్రమే వుండాలా? కాలానుగుణంగా మారితే నష్టమేమైనా వుంటుందా? అశాస్త్రీయతకు, గందర గోళం లేని భావజాలాలకు ఆస్కారమివ్వని ‘దృక్పథం’ వుండాలని ఆశించవచ్చా? ‘దృక్పథం’ జడపదార్థం కాదు, చలనశీలమైనదని ప్రతిపాదించవచ్చునా? నిర్ధిష్ట సమాధానం ప్రతిపాదించబడని ప్రశ్నలన్నీ సజన సహితమైన ఊహలకు పట్టంగడతయి. ఏకకాలంలో ఒకే వస్తువును ఒకే కవి వేర్వేరు దృక్పథాలు ప్రతిబింబించే విధంగా సజన చేస్తున్నప్పుడు కవిని ఏవిధంగా అర్ధంచేసుకోవచ్చు? దక్పథ స్పష్టత అవసరమని చెప్పాలా? ‘దృక్పథం’ను విస్మరించి వస్తువును మాత్రమే విశ్లేషించాలా? ఇవన్నీ మాట్లాడుకోవడం ద్వారా మారుతున్న పరిస్థితుల్లో ‘కవిత్వం’ స్థితిగతుల్ని అంచనా వేయగల్గుతాం.

‘శీర్షిక’ నిర్దిష్టతా స్థాయిని దాటి మాట్లాడుతది. ‘అమ్మమ్మ’ కేవలం ఒక వ్యక్తిగా గాక ఒక తరానికి ప్రతీకగా నిలబడుతది. ఇక్కడ కవి దృక్పథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పాతతరం సంస్కృతి యిప్పుడు లేదని, ఆధునికతను విమర్శిస్తున్నట్టా? ‘దిష్టి తీయటాలు, తిధులు, వారాలు చూసుకుని బయటి కెళ్లటాలు, కొత్త బట్టలు వేసుకోవటాలు, గుడి, మడి మొదలైన వాటి పట్ల కవి ఆలోచనల్ని పాఠకులు ఏవిధంగా పట్టుకోగలుగుతారు? గతకాలపు ఆచారాలు పాటించాలని కవి కోరుకుంటున్నాడా? ఆసక్తి క్రమానుగతంగా తగ్గి పోవడం పట్ల ఆవేదన చెందుతున్నాడా? అనే విషయంలో స్పష్టత మాత్రం వుండి తీరాలి. ఏ విషయం పట్ల, ఏయే సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతున్నామో తెలిసినప్పుడు కవికి వున్న స్పష్టమైన ‘దృక్పథం’ అర్థమైతది. ‘ఎత్తుగడ’ లోని కార్యకారణ సంబంధపు ప్రతీక ‘బతిమాలడం’ లోని ఉద్ధేశ్యం అవగతమైతది. పండుగనాటి హడావిడి లేకపోవడం తరతరాల సంస్కతిలోని మార్పును చూపిస్తది. జీవన విధానాలు గుణాత్మకమైన ప్రాభల్యాల్ని కనబరుస్తయి.

అమ్మమ్మా.. నువ్వు లేవు
గాలి తోలినపుడల్లా
క్యాలెండరుకు నోరొస్తుంది.
నేనున్నాను చూడండని బతిమాలుతుంది.
ఏరోజంటే ఆరోజు కొత్త బట్టలేసుకుంటున్నాం.
ఎటంటే అటు వెళ్తున్నాం.
తిథి వారాల ఆంక్షలతో
ఇపుడెవరూ నిలువరించటంలేదు..
పండుగలు వస్తున్నారు పోతున్నారు
అప్పటి హడావుడి రావటంలేదు.
అన్నిమొక్కల్లానే తులసి మొక్కలూ..
ఇపుడెవరు వాటికి మొక్కటంలేదు..
పత్తి విత్తులవటంలేదు,
దూది వత్తులవ్వటంలేదు..
విభూది తెల్లబోయే చూస్తోంది
గుడిలేదు, ఎవరికీ మడిలేదు..
మైలపెట్టె అంటే ఇప్పుడు గూగుల్‌ కీ తెలీదు..
యాభరు, వంద గ్రాముల సరుకులు
కిరాణా కొట్లో ఇపుడెవరూ అడగట్లేదు..
రెండువేల పించనుతో
నెలంతా నెగ్గుకురావటం
ఎవరూ బోధించట్లేదు..
మొక్కల మొదళ్ళలో ఎవరూ విదిలించటంలేదు
నల్ల చీమలకు చక్కెర దక్కటంలేదు..
ప్రహారీ గోడపై అన్నం ముద్ద ఉంచట్లేదు
పక్షులకు ప్రేమ మెతుకులు
ఎవరూ పంచటంలేదు..
సూర్యుడు అలుగుతున్నాడు
నమస్కరించే నీ ఉదయపు చేతులేవని..
దేవుళ్ళ పటాలు దేవులాడుతున్నారు..
వీధి అరుగు ముచ్చట కరువయ్యింది
ఇరుగు పొరుగుకు
చిట్కా వైద్యాలెవరూ సూచించటంలేదు
దిష్టి తీయటం ఎలానో
కొత్త తరాలకు తెలీటంలేదు..
అంత్రాల్లేవ్‌, తంత్రాల్లేవ్‌..
గ్రామ దేవతల మహత్తు ఎవరూ చాటటంలేదు..
నేను కథలు రాస్తున్నాను
సజీవ ఆత్మకథ నాకెవరూ వినిపించట్లేదు.

‘వస్తువు’ యథాతథ స్థితిగతుల్ని కవులు కవిత్వమయం చేసి చెబుతున్నప్పుడు సాధారణంగానే వస్తు గుణగణాల్ని కవులకు ఆపాదించుకుని, అర్థం చేసుకోవడం సమాజపు సహజాత లక్షణం. దృక్పథం యిక్కడ తన ఉనికిని చాటుకుంటది. తులసి మొక్కకు ఆరాధన దక్కక పోవడం, దూది వత్తులవకపోవడం, విభూది తెల్లబోయి చూడటం మొదలైనవి ప్రకతి ఆరాధన పట్ల సుముఖత సన్నగిల్లడంగా అర్ధం చేసుకోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం అనేది సరుకులు కొనటంలోనూ, పించనుతో నెలంతా నెగ్గుకు రావడంలోనూ కనిపిస్తది. పర్యావరణ స్పహ, జీవకారుణ్యం వంటి అంశాల్ని మొక్కలు, చీమలు, పక్షుల్ని, సూర్యున్ని ప్రవేశ పెట్టడం ద్వారా ప్రస్తావించడం జరిగింది. ఇంటి వైద్యాన్ని, మాతస్వామ్య వ్యవస్థ ప్రతీకల వైభవాల్ని సూఛాయగా తడిమినట్లు తెలుస్తుంది. ముగింపులో వైయక్తికతలోంచి సామూహికతను పరీక్షకు నిలబెట్టడం ప్రధానంగా కనిపిస్తది. బలంగా రాయగలిగిన సత్తా వున్న కవులు ‘పుస్తకాలు’ గా విస్తరిస్తే మరింతమందికి చేరువ కాగలరని ఆశిస్తూ కవికి నెనర్లు.

– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -