కాలాలు కాటేసే సర్పాలైతే
కదిలే దృశ్యాలన్నీ విగత సంకేతాలే
ఆకాశం అగ్నివర్షం కురుస్తున్నట్లుంది
భూమి నిప్పుల దుప్పటి కప్పుకున్నట్లుంది
భానుడా..
ఎందుకీ ఉగ్ర కేళీ విన్యాసం
ఏమిటీ దగ్ధ ప్రళయ కల్లోలం
యుగాల మానవ దమన రీతికి
దహనమే సరి అయిన దండననుకుంటివా
ఆగని నీ విలయ విస్ఫోటన తాండవంలో
విలవిలలాడుతున్నవి
చెమట కాల్వలు పారించే శ్రమజీవన శకలాలే
కాలు బయట పెట్టొద్దన్న ప్రకటనలు
కాలే కడుపులకు పట్టని మెట్ట వేదాంతాలు
బతుకు బండి సాగాలంటే
ఎండబండను తలపై మోయక తప్పని
బడుగు జీవుల తిప్పలు
భుజానికో సంచి.. సంకలో ఓ సంటి బిడ్డ
వడగాలులకు తలుపులు మూసుకున్న వాడల్లోంచి
పిడచగట్టుకున్న నాలుకను తడి చేసుకుంటూ
ఆగని కేకలతో ఆమె..
‘ఎంటికలకు బోల్లిత్తం.. ఎంటికలకు బోల్లిత్తం’..
ఏసీ లలో సేదదీరు తమకపు తనువుల చెవులకు
వినబడని విధివంచిత స్వరం
అరిచీ అరిచీ అలసిన ఆ దేహం
నీ కోపోద్రిక్త జ్వాలాకీలలకు చిక్కి
చివరికి ఇంటికో.. మంటికో
కూలర్ల ముందు కూర్చుంటే కూలీ దొరికేనా..
నీ మంటల మంగులంలో
తనువులు తలాయించుకుంటూ
ధనవంతుల భవంతుల నిర్మాణాల్లో
మోడులై మాడిపోతున్న కూలీలు
ఇటుక బట్టీలలో ఇగిరిపోతున్న ప్రాణాలు
వీధుల్లో ఒరిగిపోతున్న చిరు వ్యాపారుల దేహాలు
అన్నపు రూపాంతరమై ఆరుగాలం శ్రమిస్తూ
అసువులు బాస్తున్న అన్నదాతలు
ఎటు చూసినా నీ ప్రళయాగ్ని కీలలకు
ఆరిపోతున్న ప్రాణ జ్యోతులన్నీ
దిక్కుమొక్కు లేని దీన దీపంతలే
పెరిగిపోతున్న మనుషుల పాపాలకు తీర్పుగా
ప్రకోపిస్తున్నవి నీ నిరసన సెగలే అనుకున్నా..
ఏ పాపముమూ ఎరుగని పశుపక్ష్యాదులు
మూగగా చావు కౌగిట్లోకి చేరుకుంటున్న
మౌన రోదనల మాటేమిటి?
శాంతించు భాస్కరా..
సృష్టి స్థితిలయలు
నీ చిరు మందహాసాలు
పుడమి పులకింతలు
నీ దయాదాక్షిణ్యాలు
నీ క్రీగంటి చూపు చాలు
మూడో నేత్రాన్ని మూసేయ్ తండ్రీ..!
గాజోజు నాగభూషణం, 9885462052
మూడో నేత్రం మూసేయ్ తండ్రీ..
- Advertisement -
- Advertisement -



