ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ – పరకాల
ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఉండేలా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా ఇంటింటి వెరిఫికేషన్ కార్యక్రమంపై బీఎల్‌ఏలు, క్లస్టర్ ఇన్‌చార్జీలకు బుధవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నాజర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ హాజరయ్యారు. అనంతరం ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఇంటింటి సర్వే, ఓటర్ల పేర్ల తొలగింపు, తప్పుల సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎల్‌ఏలు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి, అధికారుల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసి పరకాల నియోజకవర్గం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. నెల రోజులుగా పార్టీ ఆదేశాలను అమలు చేస్తూ నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో గుర్తించిన సమస్యలు, లోపాలను సరిచేసి స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమన్నారు. డిజిటలైజేషన్ పూర్తయినప్పటికీ మ్యాప్ కాని ఓట్లు కూడా ఉన్నాయని, వాటిని పరిశీలించి ఇంటింటి వెరిఫికేషన్ ద్వారా సరైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషితో పరకాల నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.



