Saturday, September 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతు నోటికాడి బుక్క లాక్కోవడమే ఇందిరమ్మ రాజ్యామా?

రైతు నోటికాడి బుక్క లాక్కోవడమే ఇందిరమ్మ రాజ్యామా?

- Advertisement -

రైతుల సెంటు భూమి కూడా పోనివ్వం
22-ఏపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం
జాబితా నుంచి తొలగించకుంటే సెక్రెటేరియట్‌ ‌ముట్టడిస్తాం : కౌటాల బహిరంగ సభలో ఎమ్మెల్యే హరీశ్‌రావు

నవతెలంగాణ- కౌటాల
రైతు నోటి కాడి బుక్క లాక్కోవడమే ఇందిరమ్మ రాజ్యమా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం 22-ఏ భూముల నిషేధిత జాబితాపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సర్కారు రైతులను గోస పెడుతోందన్నారు. 22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోనే సుమారుగా రెండు లక్షల ఇండ్లను నిషేధిత జాబితాలో పడేశారని, అందులో సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా ఉండటంతో రాత్రికి రాత్రే తొలగించారని అన్నారు. రైతుల భూములను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 15లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో వేసిందని ఆరోపించారు. రైతులు భూములు కోల్పోతే ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే భూముల చుట్టూ రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్‌ 9, 2025న భూముల వివరాలను అందజేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. అక్టోబర్‌ 25న అప్పటి ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే నిషేధిత జాబితాలో వేసే భూముల లిస్టును ప్రభుత్వానికి పంపించారని ఆధారాలు చూపించారు. మంత్రి పొంగులేటికి ప్రజల ఉసురు తగులుతుందన్నారు.

22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించకుంటే లక్ష మంది రైతులతో కలిసి సెక్రెటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో సుమారు 40వేలకు పైగా ఎకరాలను నిషేధిత జాబితాలో వేశారని, దీనిపై కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో వంటావార్పు చేసి నిరసన తెలుపుతామని చెప్పారు. రైతులకు రైతుబంధు నిధులు రూ.29వేల కోట్లు సీఎం రుణపడి ఉన్నారని అన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్‌ ప్రభుత్వం ఏనాడూ రైతుబంధు ఆపలేదని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో కేవలం సిర్పూర్‌ నియోజకవర్గంలోనే 6 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేశామని తెలిపారు. రేవంత్‌రెడ్డి సర్కారు ఆ భూములను లాక్కుంటోందని విమర్శించారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం 9 గంటలే ఇస్తోందన్నారు. బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావ్‌, ఎర్రోల్ల శ్రీనివాస్‌, మాజీ జడ్పీ చైర్మెన్‌ కోనేరు కృష్ణారావు, సర్పంచ్‌ నక్క శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -