టాస్క్‌ఫోర్స్ అదుపులో అనుచరులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
అటవీ, దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తర్వాత కొండా అనుచరులపై పోలీసు శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సురేఖ అనుచరుడు నవీన్రాజ్ను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. సెటిల్మెంట్ల విషయంలో పలు ఫిర్యాదులు నవీన్రాజ్పై పోలీసులకు అందినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఒఎస్డీ సుమంత్‌పై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసు నమోదు కావడం, సుమంత్ పరారీలో ఉన్నది తెలిసిందే. తాజాగా నవీన్రాజ్పై పోలీసులు దృష్టి సారించడంతో ‘కొండా’ అనుచరుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నవీన్‌రాజ్ ‘కొండా’ దంపతులకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే కొండా దంపతులు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా వారి వెంట ముఖ్యమైన నేతలు ఎవరూ వెళ్లకుండా పీసీసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందుకు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య నేతృత్వం వహిస్తున్నారు.
’కొండా’పై ఎమ్మెల్యేల ఫైర్..
కొండా సురేఖపై వేటు పడిన క్రమంలో ఆమె సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కొండా సురేఖకు సవాల్ విసిరారు. ”నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. వరంగల్ తూర్పు ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారా ? లేక నన్ను ఆశీర్వదిస్తారో చూద్దాం” అని అన్నారు. మాట్లాడితే బీసీ అంటారని, మేమంతా బీసీలం కాదా ? అని ప్రశ్నించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గమే బీసీల నియోజకవర్గమన్నారు. పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరును ఎలా ప్రకటిస్తారని ‘కొండా’ ప్రశ్నించారని, మరి కొండా మురళి ఏ అర్హతతో తన బిడ్డ పరకాలకు ఎమ్మెల్యే అవుతుందని ప్రకటించారని ప్రశ్నించారు.
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం సమంజసమేనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రభుత్వంలో మూడేండ్లుగా మంత్రిగా ఉంటూ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై ఈరోజు విమర్శిస్తున్నారు.. ఇన్నేండ్లు ఎందుకు మాట్లాడలేదన్నారు.
సీఎంను విమర్శిస్తే ఊరుకునేది లేదు : గుండు సుధారాణి
సీఎంను, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదని ‘కుడా’ చైర్‌పర్సన్‌గా నియమితులైన గుండు సుధారాణి హెచ్చరించారు. సురేఖ బర్తరఫ్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను బీసీ బిడ్డగా, పద్మశాలి ఆడపడుచుగా గుర్తించి ‘కుడా’ చైర్పర్సన్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
‘కొండా’పై స్పెషల్ ఫోకస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



