Saturday, September 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంటర్ విద్యను తీసేస్తే ఊరుకోం

ఇంటర్ విద్యను తీసేస్తే ఊరుకోం

- Advertisement -

ఇంటర్ విద్యా జేఏసీ సమావేశంలో టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి కంటే తుగ్లక్ నయమనీ, సమస్య లేని చోటికొచ్చి పరిష్కరిస్తానంటున్నారని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోని మీడియా అకాడమీలో నిర్వహించిన సేవ్ ఇంటర్ ఎడ్యుకేషన్ జంగ్ సైరన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ ఇంటర్ విద్య అగ్రస్థానంలో ఉందనీ, దాని ప్రత్యేకతను తొలగించడమెందుకని ఆమె ప్రశ్నించారు. ఇంటర్ బోర్డును ఎస్సెస్సీ బోర్డులో విలీనం, పాలిటెక్నిక్, ఐఐటీల అస్థిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, ఇంజినీరింగ్ విద్య వేస్ట్ అనడం వంటి సీఎం మాటలు వింటే భయమేస్తుందని తెలిపారు. ఇంటర్ విద్యా విధానాన్ని తీసేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఇంటర్ విద్య ప్రత్యేకంగా ఉండాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. సిలికాన్ వ్యాలీ నుంచి ప్రపంచ టాప్ ఆయిల్ కంపెనీల్లో తెలుగు ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో కనిపించడానికి తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఇంటర్ విద్యే కారణమని ఆమె వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు పాలిస్తున్నారో అర్థం కావడం లేదని కవిత ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్ విద్యను రద్దు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఇంటర్ బోర్డు అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తుచేశారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను సరి చూసుకునేందుకు పరీక్షలు అవసరమనీ, ఇంటర్ ఫస్టియర్ లో పరీక్షలు ఎత్తేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకులకు ఎన్నికల మాదిరిగానే విద్యార్థులకు పరీక్షలు ఉండాల్సిందేనని సూచించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలన్న సిఫారసుపై కూడా కవిత అగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పరీక్షించి, ప్రయోగించి, విఫలమైన వాటిని కొత్త సిఫారసుగా ఇచ్చారని తప్పుపట్టారు. విద్యా కమిషన్ వేశారనీ, దాని సిఫారసులను చెత్తబుట్టలో వేస్తున్నామని ప్రకటించారనీ, మళ్లీ కె.కె కమిటీ వేశారనీ, ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుందో తెలియని గందరగోళ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రానికి సొంతంగా ఇప్పటికీ సంవత్సరానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యకు రూ.50 వేల కోట్లు, ఉచిత వైద్యానికి రూ.50 వేల కోట్లను ఖర్చు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇంటర్ విద్యా విధానాన్ని కాపాడేందుకు జరిగే పోరాటంలో టీఆర్ఎస్ భాగస్వామి అవుతుందనీ, ముందు వరసలో ఉండి పోరాడుతుందని తెలిపారు.

ఏపీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి : మధుసూదన్ రెడ్డి
ఫిన్ లాండ్ కు వెళ్లి అక్కడి విద్యారంగం పరిస్థితిని పరిశీలించే తీరిక ఉన్న ఉన్నతాధికారులు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం లేదని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కార్మీర్ ఎన్ఐటీలో కూడా 50 శాతం మంది విద్యార్థులు తెలుగు వారే ఉండటానికి ఇక్కడి ఇంటర్ విద్యా విధానమే కారణమని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్యా విధానం నచ్చడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకునేందుకు వస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆ ఇంటర్ ను పాఠశాల విద్యలో విలీనం చేయాలనుకోవడం సహేతుకంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించినట్టే సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ మాజీ చైర్మెన్ ఆకునూరి మురళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చిన సలహాలే జగన్మోహన్ రెడ్డిని ముంచాయని ఆరోపించారు.
తనకు తానే మేధావి అని చెప్పుకునే కొంత మంది మేథావులు ఇచ్చే సలహాలు పాటించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విలీనం యోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 10 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది తల్లిదండ్రులు, 6 వేల మంది బోధనా సిబ్బంది, 4 వేల మంది బోధనేతర సిబ్బందితో ప్రత్యేకంగా ఉండి ఫలితాలిస్తున్న దాన్ని అలాగే కొనసాగించాలని ఆయన సూచించారు. ఇంటర్ విద్యను ముట్టుకుంటే 2034 వరకు సీఎం కొనసాగడం సంగతేమో గానీ, సీఎం రేవంత్ రెడ్డి 2028 వరకు ఉంటారా అనేది అనుమానమే అని వ్యాఖ్యా నించారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు దూరదృష్టితో తెచ్చిన ఇంటర్ విద్య ఉన్నత విద్యకు మొదటి మెట్టుగా పరిగణింపబడుతుందని చెప్పారు. కొఠారి సిఫారసుల మేరకు విద్యావేత్తలకు లోతైన విశ్లేషణ అనంతరం దేశవ్యాప్తంగా ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకే విలీనం అని చెబుతన్నదంతా వట్టి సాకు మాత్రమేనని కొట్టిపారేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -