రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక తప్పుడు ప్రచారాలు
ఆరోపణలు నిరూపిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధం: మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్
నవతెలంగాణ-ఆలేర్ రూరల్
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య (అయిలన్న)ను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేసేందుకు కొంతమంది బీఆర్‌ఎస్,బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్ మండిపడ్డారు.మంగళవారం నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక సోషల్ మీడియాలో వీడియోలు,నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాలేనని ఆయన పేర్కొన్నారు. అయిలన్న రాజకీయంగా ఎదుగుతున్న తీరును ఓర్వలేక కొందరు బట్టకాల్చి మీదేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రజలు ఇలాంటి రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు.
ఆరోపణల్లో నిజం ఉంటే ఆధారాలతో సహా నిరూపించాలని పిక్క శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే అయిలన్నతో పాటు తాము కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం,సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు సాగించడం రాజకీయ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే ఆరోపణలు చేసేటప్పుడు వాటికి ఆధారాలు ఉండాలని అన్నారు.నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. అయిలన్నను Inconvenience విమర్శిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పిక్క శ్రీనివాస్ స్పష్టం చేశారు.ఆరోపణలు–వాస్తవాలు ప్రజల ముందే తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.



