ఫుడ్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

– అగ్నికి ఆహుతైన కంపెనీ, భారీగా ఆస్తి నష్టం
తప్పిన ప్రాణం నష్టం
– ఖానాపూర్‌లోని కార్ల గోదాంలోనూ అగ్ని ప్రమాదం
– 25 కార్లు దగ్థం
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌/గండిపేట
కాటేదాన్‌ పాయల్‌ ఫుడ్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని పాయల్‌ ఫుడ్‌ బిస్కెట్‌ కంపెనీలో గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో కంపెనీ మూడో అంతస్తులో యంత్రం దగ్గర మంటలు వ్యాపించాయి. అక్కడే పని చేస్తున్న కార్మికులు.. గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఆరకపోగా క్షణాల్లో వ్యాపించాయి. దాంతో కార్మికులందరూ బయటకు పరిగెత్తారు. కార్మికులు.. యాజమాన్యానికి, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. ఐదు ఫైర్‌ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. సుమారు 6 గంటలు కష్టపడి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో కార్మికులందరూ బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులకుపైగా పని చేస్తున్నారు. మంటల ధాటికి కంపెనీ పూర్తిగా ధ్వంసమైంది. కంపెనీ ఏ క్షణాల్లోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఆ కంపెనీలోకి ఎవరిని పోలీసులు అనుమతించలేదు. ఈ ఘటనలో కంపెనీకి భారీగా ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీనివాస్‌, రంగారెడ్డి జిల్లా ఫైర్‌ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు, రాజు పరిశీలించారు.
కంపెనీలో ఉన్న ఫైర్‌ సేఫ్టీ పరికరాలు సకాలంలో పని చేయకపోవడమే ఈ భారీ అగ్ని ప్రమాదానికి కారణమని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వరంపల్లి జైపాల్‌రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాద ఘటన తెలిసిన వెంటనే జైపాల్‌ రెడ్డి అక్కడికి వెళ్లి కార్మికులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంపెనీ యాజమాన్యం కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేనేండ్ల క్రితం ఏర్పాటు చేసిన కంపెనీలో అప్పుడు అమర్చిన ఫైర్‌ సేఫ్టీ పరికరాలే ఉండటంతో అవి పనిచేయలేదన్నారు. నైట్‌షిఫ్ట్‌లో తక్కువ మంది కార్మికులు ఉండటంతో వెంటనే బయటకు రాగలిగారని, అదే పగలు జరిగి ఉంటే సుమారు 400 నుంచి 500 మంది కార్మికులు బయటకు రావడానికి అవస్థలు పడాల్సి వచ్చేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి నూతన సేఫ్టీ పరికరాలను అమర్చాలని డిమాండ్‌ చేశారు.
కార్ల గోదాంలో అగ్ని ప్రమాదం : 25 కార్లు దహనం
గండిపేట మండలం ఖానాపూర్‌లోని ఓ కార్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 కార్లు పూర్తిగా దహనమయ్యాయి. నార్సింగి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మున్సిపాలిటీలోని ఖానాపూర్‌లో కార్ల సర్వీస్‌ సెంటర్‌లో షార్ట్‌సర్య్కూట్‌తో మంటలు చెలరేగాయి. ఆ మంటలు గోదాం అంతటా వ్యాపించడంతో అక్కడే ఉన్న 25 కార్లు పూర్తిగా కాలిపోయాయి. గమనించిన నిర్వహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కారణాలపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love