మతతత్వ శక్తులకు గుణపాఠం

 ”కర్నాటక ఎన్నికలు- పాటలు”పై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్‌ చంద్రకుమార్‌
నవతెలంగాణ-బంజరాహిల్స్‌
కర్నాటక ఎన్నికలు మతతత్వ శక్తులకు ఒక పెద్ద గుణపాఠం చెప్పాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. ”కర్నాటక ఎన్నికలు – పాటలు” అనే అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రకుమార్‌ పాల్గొని మాట్లాడారు. మతతత్వం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఇతర మతస్థుల్లో, సమాజంలో తీవ్ర అశాంతి, అభద్రత రెచ్చగొట్టి, పాలన కొనసాగించాలనే విధానాలకు కర్నాటక ఎన్నికలు పాతిపెట్టాయని తెలిపారు. మతం పేరిట మెజారిటీ మతస్తుల్ని సమీకరించి పెట్టుబడిదారీ విధానాన్ని ఉద్ధరించే పాలనను తిరస్కరించారన్నారు. ఐఏఎస్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. కర్నాటక ప్రజలు బీజేపీకి ఎలాంటి బుద్ధి చెప్పారో, తెలంగాణలో ఇటు బీజేపీ, అటు తెలంగాణ ప్రజలకు అన్ని విధాల వ్యతిరేకంగా మారిన బీఆర్‌ఎస్‌ పార్టీకి కూడా అలాంటి బుద్ధి చెప్పాలన్నారు. ఆ రెండు పార్టీలు ప్రభుత్వ ఖజానాను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. మిగతా పాలక పార్టీలకు కూడా అవ లక్షణాలు ఉన్నాయని.. అయితే దేశంలో ప్రజల కర్తవ్యం తక్షణం బీజేపీని ఓడించడం అని స్పష్టంచేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులు మురళీధర్‌, వివిధ పార్టీల నాయకులు సదేరా బేగం, రమ్యా రావు, వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మైనార్టీ, ప్రగతిశీల పెద్దలు, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love