ఐకేపీ వీవోఏల సమ్మెకు మద్దతుగా రేపు మండల కేంద్రాల్లో నిరసనలు సీఐటీయూ పిలుపు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 35 రోజులుగా సమ్మె చేస్తున్న ఐకేపీ వీవోఏలకు మద్దతుగా మంగళవారం మండల కేంద్రాల్లో నిరసలను తెలపాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో భాగంగా ఉద్యోగులు రిలే దీక్షలు, నిరసనలు, వంటావార్పు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో సమ్మెలో ఉన్న ఉద్యోగులను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ. రమ, రాష్ట్ర కార్యదర్శి పి. శ్రీకాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌, కోటంరాజు, వై. సోమన్న తదితరులు విలేకర్లతో మాట్లాడారు. యూనియన్లకు అతీతంగా వీవోఏలు ఐక్యంగా సమ్మె నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామ సమాఖ్య సంపూర్ణ మద్దతునిస్తున్నాయని చెప్పారు. 19 ఏండ్లుగా పేదరిక నిర్మూలన పథకంలో ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గౌరవ వేతనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.3,900 మాత్రమే చెల్లించి వారికి అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. సెర్ప్‌ అధికారులకు, ప్రభుత్వానికి పలు దఫాలుగా రాయబారాలు, విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి నెలలో మూడు రోజులపాటు టోకెన్‌ సమ్మె చేసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. తక్కువ వేతనాలు, తీవ్ర పని భారం మోపిన నేపథ్యంలో అనివార్యంగా సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. న్యాయమైన డిమాండ్లను సానుభూతితో పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఉద్యోగులను సమ్మెలోకి నెట్టిందన్నారు. ఈ చట్టబద్ద సమ్మె పట్ల సెర్ప్‌ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సమ్మెను విరమించాలంటూ అక్రమంగా నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి చొరవ తీసుకొని సెర్ప్‌ ఉన్నతాధికారుల సమక్షంలో సమ్మె చేస్తున్న యూనియన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపాలని డిమాండ్‌ చేశారు. ఐకేపీ వీవోఏలతోపాటు అన్ని రంగాల్లోని కార్మికులు ఈ నిరసనల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
డిమాండ్లు
8ఐకేపీ వీవోఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
8కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి
8రూ. 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి
8సెర్ప్‌ నుంచి ఐడి కార్డులు ఇవ్వాలి
8గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలు వీవోఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలి.
8జాబ్‌ చార్ట్‌లతో సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులతో సహా ఇతర పనులు చేయించరాదు.
8వీవోఏల పైన మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఎస్‌హెచ్‌జీలకు వీఎల్‌ఆర్‌, అభయహస్తం డబ్బులు చెల్లించాలి
8ఎస్‌హెచ్‌జీ/ వీఏ లైన్‌ మీటింగ్స్‌ రద్దు చేయాలి
8 అర్హులైన వీవోఏలను సీసీలుగా ప్రమోషన్స్‌ కల్పించాలి.

Spread the love