ఉత్సాహంగా ముగిసిన.. తెలంగాణ బాలోత్సవ సమ్మర్‌ క్యాంప్‌

నవతెలంగాణ-ముషీరాబాద్‌
తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మే 5వ తేదీ నుంచి 21 వరకు 16 రోజుల పాటు నిర్వహించిన బాలోత్సవం ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ బాలోత్సవ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు సమ్మర్‌ హాలిడేస్‌ను ఆనందించడమే కాకుండా అర్థవంతంగా మార్చుకున్నారని తెలిపారు. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త స్నేహితులతో సరికొత్త నైపుణ్యాలను నేర్చుకున్నట్టు చెప్పారు. మరి ముఖ్యంగా అమ్మాయిల్లో మనోధైర్యంతో పాటు ప్రశ్నించేతత్వాన్ని నేర్పారన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త కేఎల్‌ కాంతారావు మాట్లాడుతూ.. పిల్లల్లో మూఢనమ్మకాలు, సైన్స్‌పై అవగాహన అద్భుతంగా ఉందన్నారు. బాలల్లో దేశభక్తి పెంపొందించుకోవడ ం కోసం, విజ్ఞానం, వికాసం కోసం ఈ సమ్మర్‌ క్యాంప్‌ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. తెలంగాణ బాలోత్సవం భావి భారత పౌరుల సమస్యలను బాధ్యతగా పట్టించుకుందని కొనియాడారు. పిల్లల కంటే ప్రపంచంలో మరేదీ విలువైంది లేదని చెప్పారు. బాలలే భావి భారత పౌరులని, బాల్యాన్ని సక్రమంగా వినియోగిస్తే దేశాన్ని బంగారు మయం చేయొచ్చు అని తెలిపారు. దీనికి తల్లిదండ్రులు ప్రభుత్వం బాధ్యత తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో భూమిక మాసపత్రిక ఎడిటర్‌ కొండవీటి సత్యవతి, తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్‌ సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి, మమత, సుశీల, దూది పద్మావతి, రాజకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love