రామాయణం అంతరార్థం తెలిపే సినిమా

సౌద అరుణ స్టూడియోస్‌ పతాకంపై పాపులర్‌ రైటర్‌ సౌద అరుణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కోడ్‌ రామాయణ’.. ఈ చిత్ర టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఫిలిం ఛాంబర్‌లో గ్రాండ్‌గా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన బౌద్ధ బిక్షువు బంతె షీల్‌ రక్షిత్‌, ప్రముఖ రచయిత్రి లలిత.పి. చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా భరద్వాజ మాట్లాడుతూ, ‘రామాయణాన్ని ‘పూర్వ రామాయణం’, ‘రావణచరిత్ర’, ‘ఉత్తర రామాయణం’.. ఇలా మూడు భాగాలు ఇందులో చెప్పాం. ‘కోడ్‌ రామాయణ’ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం. అలాగే రామాయణంలో ఏం చెప్పడం కోసం రామాయణం వచ్చింది అనేది ముఖ్య ఉద్దేశ్యం’ అని తెలిపారు. చిత్ర దర్శకులు సౌద అరుణ మాట్లాడుతూ,’అప్పుడు, ఇప్పుడు సంగీత సాహిత్యాలతో వర్దిల్లిన గడ్డే ద్రవిడ భూమి. ఈ గడ్డపై పుట్టిన మేం జై శ్రీ రావణ అని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ద్రవిడ భూమి ఆత్మ గౌరవం అనే నినాదంతో ద్రవిడ భూమి గొప్ప తనాన్ని ప్రపంచం మరింత అర్థం చేసుకోవడానికే ఈ సినిమా చేస్తున్నామే తప్ప ఎవరినీ వ్యతిరేకించడానికి ఈ సినిమా తీయడంలేదు. ఈ మూడు భాగాల .ప్రాజెక్టు చేయడం ఒక దశాబ్ద కాలం పట్టే యజ్ఞం. ఇప్పటి వరకు మేము మూడవ వంతు పని మాత్రమే చేశాం’ అని తెలిపారు.

Spread the love