విమానంలో హైజాకింగ్ గురించి ఫోన్ సంభాషణ..

నవతెలంగాణ – హైదరాబాద్: విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి హైజాకింగ్ అని మాట్లాడటం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విస్తారా విమానం బయల్దేరేందుకు రన్ వేపై సిద్ధంగా ఉంది. అంతలోనే విమానంలోని 23 ఏళ్ల రితేష్ సంజయ్ కుమార్ అనే ప్రయాణికుడు హైజాకింగ్ గురించి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడాడు. ఇది విన్న విమాన సిబ్బంది వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 336, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ ప్రయాణికుడి మానసిక స్థితి సరిగా లేదని, 2021 నుంచి వైద్య చికిత్స పొందుతున్నట్లు విచారణలో తేలింది.

Spread the love