ఉక్కు సంకల్పం..

– అరికాళ్లు పగిలినా.. పాదాలు రక్తమోడినా.. ఆగని రైతు ‘మహా’ పాదయాత్ర
ముంబయి: అరికాళ్లు పగిలినా, పాదాల నుంచి రక్తం కారుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా మహారాష్ట్ర రైతులు కదం తొక్కుతున్నారు. ఐదు రోజుల కిందట నాసిక్‌ నుంచి ముంబయి వరకు 200 కిలోమీటర్ల మేర తలపెట్టిన మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పలు డిమాండ్లతో అన్నదాతలు ఈ యాత్రను ప్రారంభించారు. ఉల్లిరైతులకు క్వింటాకు రూ.600 తక్షణమే అందించాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని, ఇలా పలు డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు. ధరలు భారీగా పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే అధిక ఉత్పత్తి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అన్నారు. అలాగే క్వింటాకు రూ.300 మేర పరిహారం ప్రకటించారు. ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో ఈ మార్చ్‌ జరుగుతోంది. ఇందులో రైతన్నలతో పాటు గిరిజన సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొంటున్నారు. వీరితో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ఇద్దరు మంత్రులను నియమించింది. వారు ఇప్పటికే రైతు ప్రతినిధులను కలిశారు. అలాగే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గురువారం వారితో సమావేశం కానున్నారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలంటూ విపక్షాలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలో స్పందించింది. ‘వారు 14 డిమాండ్లతో ఈ పాదయాత్ర చేస్తున్నారు. చట్టపరిధిలో ప్రభుత్వం వాటన్నింటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది’ అని తెలిపింది. ‘మా డిమాండ్లను నెరవేర్చుకునేందుకు మేం ఇలా నడుస్తూనే ఉంటాం’ అని ఓ మహిళ వెల్లడించింది. కొందరి చెప్పులు తెగిపోయినా,,అలానే నడవటానికి సన్నద్ధమవుతున్నారు. కాళ్లకు గాయాలవుతున్నా..నీరసించినా..ఉక్కు సంకల్పం వారిని ముందుకు నడిపిస్తోంది.

Spread the love