ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై కరిన చర్యలు తీసుకోవాలి

– ఎస్‌కేఎం నేతల డిమాండ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) డిమాండ్‌ చేసింది. సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం హైదరాబాద్‌ సుందరయ్య పార్క్‌ వద్ద ‘కేంద్రప్రభుత్వ’ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌కేఎం రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, మూడ్‌ శోభన్‌, జక్కల వెంకటయ్య, సిహెచ్‌ రామచందర్‌ మాట్లాడుతూ అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడుతున్న ఓలింపిక్‌ పతక విజేతలతోసహా మన అగ్రశ్రేణి క్రీడాకారులకు న్యాయం చేయాలని కోరారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న మల్లయోధులను రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ‘బేటీ బచావో బేటీ పడావో’ అంటూ సంబరాలు చేసుకుంటూనే, మరోవైపు ఈ దారుణమైన నేరంలో నిందితుడైన బీజేపీ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.ఎల్‌ పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.హన్మేశ్‌, పీవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌, పీవోడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప, నాయకులు కిరణ్‌, లింగం గౌడ్‌, రవీందర్‌, రవి కుమార్‌, వరలక్ష్మి, దేవమని, పుష్ప, నాగమ్మ, వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love