కోవిడ్‌ కంటే వాయు కాలుష్యమే కారణం

– ప్రపంచ మరణాలపై నిపుణుల నివేదిక
– ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
– పసిపిల్లల పరిస్థితి మరింత దయనీయం
పాట్నా : దేశంలోని పలు ప్రాంతాలలో వీస్తున్న వడగాలుల కారణంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖాట్మండుకు చెందిన నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని మరణాలకు కోవిడ్‌ కంటే వాయు కాలుష్యమే ఎక్కువ కారణమవుతోంది. భారత్‌లోనే కాకుండా పలు దేశాలలో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌, నేపాల్‌తో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలలో వీస్తున్న వడగాలులు…దాని ద్వారా పెరుగుతున్న వాయు కాలుష్యం నిరుపేదలు, కార్మికులకు ప్రాణసంకటంగా మారుతోంది. ముఖ్యంగా నెలలు నిండని పసిపిల్లలు శ్వాసకోశ సమస్యలతో విలవిల్లాడుతున్నారు. వీటితో పాటు గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాలతో దినదినగండంగా కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా నిరుపేదలే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారని నిపుణుల అధ్యయన నివేదిక తెలిపింది.’ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ కోవిడ్‌తో మరణించిన వారి కంటే వాయు కాలుష్యంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది’ అని వాయు నాణ్యతా నిపుణుడు డాక్టర్‌ భూపేష్‌ అధికారి చెప్పారు. అయినప్పటికీ వాయు కాలుష్యం విషయంలో మనమేమీ చేయలేకపోతున్నామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘మన ప్రాంతంలో వాయు కాలుష్యానికి కారణమేమిటో, దానిని ఎలా నివారించాలో మనకు తెలుసు. స్వచ్ఛమైన గాలి కోసం మనం ప్రభుత్వంతో, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాల్సి ఉంది’ అని భూపేష్‌ వివరించారు. అడవులలో ఏర్పడుతున్న అగ్ని ప్రమాదాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నివేదిక తెలిపింది. వాతావరణ మార్పులు, నివాస ప్రాంతాలలో వ్యర్థ పదార్థాలను తగలబెట్టడం కూడా కాలుష్య కారకాలు అవుతున్నాయి. ఈ కాలుష్యం జీవవైవిధ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మంచు పర్వతాలు ఆందోళన కలిగించే స్థాయిలో కరిగిపోతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ రెండు డిగ్రీలు పెరిగితే యాభై శాతం మంచు పర్వతాలు కనుమరుగవుతాయి. ఫలితంగా నదీ ప్రవాహాలపై ప్రభావం పడుతుంది. స్వచ్ఛమైన నీటికి సంబంధించిన జీవవైవిధ్యం, వ్యవసాయం, తాగునీరు, ఇతర మానవ అవసరాల విషయంలో కూడా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. వాయు నాణ్యత పడిపోవడంపై నిపుణుల నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

Spread the love