కాసాని గెలుపునకు బీసీలంతా ఏకం కావాలి

– ఎన్నికల కోసమే రంజిత్‌రెడ్డి తాండూరుకు వస్తున్నాడు
– మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఎన్నికలు వస్తేనే రంజిత్‌ రెడ్డి తాండూరుకు వస్తాడని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన నాయకులు ఇంకా ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. వృద్ధులకు రూ. 4 వేలు పింఛన్‌ ఇస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయలేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గానికి తెచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడం చేతకాక పనులు నిలిచి పోయాయన్నారు. కొండాకు ఓటు వేసి వృధా చేసుకోవద్దన్నారు. కాసాని గెలుపు కోసం బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ కోసం బీసీలు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా జడ్పీ వైస్‌ చైర్మెన్‌ బైండ్ల విజరు కుమార్‌, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ రాజు గౌడ్‌ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్‌కి అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ తాండూరు నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలు , అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love