వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీని ఓడించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-దోమ/పరిగి
సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం పరిగి పట్టణంలో 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్బంగా పరిగి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ జెండాను సీపీఐ(ఎం)జిల్లా కార్యవర్గ సభ్యుల ఎం. వెంకటయ్య ఎగురవేశారు. అనంతరం ఎలక్ట్రిసిటీ కార్యాలయం ఎస్పియం అధ్యక్షులు ఆనంద్‌ సీఐటీయూ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య మాట్లాడుతూ కార్మికుల రక్తపు మడుగులో నుంచి పుట్టిన జెండా ఎర్ర జెండా కార్మికుల హక్కుల సాధనకై పెట్టుబడు దారులను ఎదిరించి పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలను, హక్కులను సాధించుకున్నారని అన్నారు. కార్మికులు అనేక సంవత్సరాల పాటు పోరాటం చేసి అనేక త్యాగాలతో 42 కార్మిక చట్టాలను సాధించుకుంటే, ఆ చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లుగా కుదించారన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకష్ణ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. పెరిగిన గ్యాస్‌ పెట్రోల్‌, డీజిల్‌, ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దార దత్తం చేస్తుందని అన్నారు. రాజ్యాంగ మూలాలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని వ్యతిరేకించాలని, కార్పొరేట్లు స్విస్‌ బ్యాంకులో దాచుకున్న నల్లధనం తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో 15 లక్షల జమ చేస్తానని బీజేపీ మాయమాటలు చెప్పారన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు మోడీ ఇచ్చిన హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎండీ. హబీబ్‌, సత్యయ్య, రఘురామ్‌, మున్సిపల్‌ కార్మికులు కిష్టయ్య, నర్సిములు, రమేష్‌, చందర్‌, నరేందర్‌, ఎలక్ట్రిసిటి కార్మికులు ఆనంద్‌, జంగయ్య, బీమయ్య, శేఖర్‌, కష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love