మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం…

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అక్టోబర్‌ 24న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక టోనీ బ్లెయిర్‌ ఇనిస్టిట్యూట్‌ టెక్‌ యాక్సిలరేటర్‌ 2023 ఫోరంలో కీలక భాగస్వామిగా పాల్గొనాలని ఆహ్వానం అందింది. టోనీ బ్లెయిర్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ ఛేంజ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వాన లేఖ పంపించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా వినియోగం ద్వారా ప్రభుత్వ భవిష్యత్తు, ప్రజా సేవలను మెరుగుపర్చి వాటిని మరింత సరసమైన ధరకు అందించేందుకుగాను ఒక విజన్‌ను రూపొందించినట్లు బ్లెయిర్‌ తన ఆహ్వానంలో పేర్కొన్నారు. తమ ఈ విజన్‌కు వాస్తవరూపం ఇవ్వడంలో మీరు ముఖ్యమైన భాగమని తాము నమ్ముతున్నామని.. అందుకే భవిష్యత్తు కోసం లీడర్‌ల ఫోరమ్‌ అయిన తమ రెండవ టెక్‌ యాక్సిలరేటర్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టోనీ బ్లెయిర్‌ నుంచి వచ్చిన ఆహ్వానంపై మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పరిశ్రమలు, ఇన్నోవేషన్‌ తదితర రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సాధిస్తున్న ప్రగతికి ఈ ఆహ్వానం ఒక గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.

Spread the love