నవతెలంగాణ-హైదరాబాద్ : వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లిని పులివెందుల నుంచి హైదరాబాద్ తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు మార్గమధ్యంలో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లిని తొలుత పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అటు, ఎంపీ అవినాశ్ రెడ్డి మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. వెంటనే పులివెందుల బయల్దేరారు. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, ఎంపీ అవినాశ్ రెడ్డి తన కాన్వాయ్ ని వెనక్కి తిప్పారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కర్నూలులో చికిత్స చేయించారు. అనంతరం ఆమెను హైదరాబాద్ తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.