బియ్యమో… రామచంద్రా!

ముందుచూపు లేకుండా అకస్మాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన మోడీ సర్కారు తీరుతో ఇప్పుడు ప్రపంచమంతా బియ్యమో… రామచంద్రా అంటోంది. స్వదేశంలో సైతం ప్రజల అవసరాలకు ఆహార ధాన్యాలు ఎంత అవసరమో తెలుసుకోలేంత గుడ్డితనంలో పాలకులుండటమే ఇందుకు కారణం. గోదాముల్లో నాలుగేండ్లకు సరిపడా బియ్యం నిల్వలున్నాయని సర్కారు ఢాంబికాలు పలికి ఏడాదిన్నర తిరగకముందే దేశంలో పరిస్థితులన్నీ తిరగబడ్డాయి. మా వద్ద మస్తు నిల్వలున్నాయన్న నోటితోనే కొరత ఉన్నదని గగ్గోలు పెడుతున్నది. ధాన్యం ఉత్పత్తి పెంచి కొరత తీర్చడం చేతగాక… బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు క్షణాల్లో పాశ్చాత్య దేశాలకు పాకిపోయాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ధరలు శనివారం నుంచే కుతకు తలాడుతున్నాయి. ప్రజల్లో రేగిన ఆందోళన సెగలు మాల్స్‌ను తాకాయి. ఎగుమతులు ఆగిపోతే మార్కెట్లలో కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగిపోతాయన్న ఆందోళన వినియోగదారులను మాల్స్‌లో ఎగబడేలా చేస్తోంది. జనం నుంచి వస్తున్న డిమాండ్లను చూసి సందట్లో సడేమియా అన్నట్టు ధరలు అమాంతం పెంచి మన కరెన్సీలో రూ.160నుంచి రూ.200కు కిలో బియ్యాన్ని అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల నో స్టాక్‌ బోర్డులు వేళాడేశారు. మాల్స్‌ ముందు బియ్యం కొనేందుకు ప్రజలు కిలోమీటర్ల దూరం క్యూ లైన్లలో నిలబడ్డారంటే అదంతా కేంద్ర సర్కారు పుణ్యమే.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు బియ్యం ఉత్పత్తి చేస్తున్న రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై రైతులు, రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణకు ఉపయోగించే డీజిల్‌ ధరలపై రాయితీలు ఎత్తివేసి, జీఎస్‌టీని ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్రం… వ్యవసాయరంగంలో విత్తనాలతో పాటు, పురుగు మందులు, రసాయనిక ఎరువులు అన్నింటి ధరలు ఆకాశానికి చేర్చింది. దీంతో రైతులకు వ్యవసాయం ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయి ఆహార ధాన్యాల కొరతతో ధరలు పెరిగితే వినియోగదారులకు భారం కాకుండా రాయితీలు కల్పించి ఆహారధాన్యాలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా ధాన్యం పండించే రైతుల పీక నొక్కేలా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల దిగుబడులు తగ్గాయనీ, పంట నష్టం జరిగిందని ప్రభుత్వం కారణంగా చెబుతోంది. ఇది నమ్మశక్యం కాని విషయం. ఈ ఏడాది అకాల వర్షాలు పడిన మాట నిజమే. అధిక వర్షాల సమస్య వచ్చి కొద్ది రోజులే అయింది. అంతవరకూ పండిన పంట ఏమైంది? రైతుల వద్ద చౌకధరకు ధాన్యాన్ని సేకరిస్తున్న మిల్లర్లు, వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి బియ్యం ధరను పెంచేస్తున్నారంటూ వామపక్షాలు చేసిన విమర్శలను పాలక పార్టీలు కొట్టేయవచ్చు. కానీ, అవి వాస్తవాలన్న సంగతి ఇప్పుడు అవగతం అవుతోంది.
దేశ ధాన్యాగారంగా పేరుపొందిన తెలంగాణ వరి రైతులను దెబ్బతీసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలింకా మర్చిపోలేదు. గతేడాది బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుకు ఎఫ్‌సిఐ నిరాకరించింది. ఇప్పటికే బియ్యం నిల్వలు కేంద్ర గోదాముల్లో మూడేండ్లకు సరిపడా మూలుగుతున్నాయని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం ప్రకటించింది. బియ్యం కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ రాష్ట్రం నుంచి అదనంగా ఒక్క గింజ కూడా కొనుగోలు చేసేది లేదని భీష్మించింది. నూకల బియ్యం తినమని ఉచిత సలహా ఇచ్చింది. తీరా ఇప్పుడు వర్షాలు లేక, వరిసాగు విస్తీర్ణం తగ్గటంతో మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆహార భద్రత గుర్తుకు వచ్చింది. తాజాగా కేంద్రం అమలులోకి తెచ్చిన బియ్యం ఎగుమతుల నిషేధంతో మన రాష్టంలోనూ రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ప్రభుత్వ తత్తరపాటు నిర్ణయాలు దేశ ప్రజలనే కాకుండా విదేశాల్లో ఉంటున్న భారత పౌరులను కూడా తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. అత్యధిక బియ్యం ఉత్పత్తిదారు అయిన చైనాలో కూడా వాతావరణం అనుకూలించక దిగుబడి తీవ్రంగా పడిపోయింది. బియ్యం ఎగుమతులపై మోడీ సర్కారు ఉన్నట్టుండి నిషేధం విధించటంతో అమెరికాలోని భారతీయులు ముఖ్యంగా బియ్యం అధికంగా తినే తెలుగువారు హాహాకారాలు చేస్తున్నారు.
కేంద్రం వరి సాగు వద్దనడంతో చాలా రాష్ట్రాలు సాగు తగ్గించాయి. దీంతో దేశ వ్యాప్తంగా సాగు 50శాతానికి పడిపోయింది. ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయిన ఫలితంగా నేడు బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధాన్యం ఉత్పత్తి పెంచి కొరత తగ్గించడంపై దృష్టి పెట్టకుండా… బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love