దేశానికి బీజేపీ ప్రమాదకరం

– రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
– ప్రతిపక్షాలను ఈడీ, సీబీఐ, ఇన్‌ కంటాక్స్‌ సంస్థలతో బెదిరింపులు
– అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి :
– సీపీఐ(ఎం)పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి ప్రమాదకారిగా మారిందని, దీని నియంత్రణకు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమవర్థంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లాలోని రాయనిగూడెం గ్రామంలో జరిగిన వర్థంతి సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు ఫెడరిలజాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకుందని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తూ వాటిపై ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. ప్రతిపక్షాలను అణచివేయలనే ఉద్దేశంతో వారిపై అవినీతి ఆరోపణలు రుద్దుతూ ఈడీ, సీబీఐ, ఇన్‌కంటాక్స్‌ సంస్థలతో కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదా.. మరి అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాల ఫెడరల్‌ హక్కుల పరిరక్షణకు శక్తులన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అప్‌ నేతలపై కేంద్ర వైఖరి పట్ల ఇతర రాష్ట్రాల ప్రతిపక్ష ముఖ్యమంత్రులు స్పందించడం శుభపరిణామమన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వేలు పెట్టడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుందని, ఇందులో భాగంగానే అనేక సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుందన్నారు. లేకపోతే అప్పులు తెచ్చుకునే అవకాశం లేకుండా కేంద్రం కొర్రీలు పెడుతుందని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్‌ మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి చేసినప్పటికీ సీఎం కేసీఆర్‌ దాన్ని అమలు చేయనని ఖరాఖండిగా చెప్పడం అభినందనీయమన్నారు. అసెంబ్లీలో పాస్‌ అయిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకుండా తొక్కి పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిదని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపరులీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తిరిగి వెంటనే పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love