బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి

– సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు
– సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, ఆలిండియా రెజ్లింగ్‌ ఫెడరేషన అధ్యక్షులు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను వెంటనే ఆరెస్టు చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెజ్లర్లపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. మహిళా రెజ్లర్లకు అండగా నిలుద్దాం..అండగా నిలుద్దాం.., రెజ్లర్లపై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో యాక్టు కింద కేసు పెట్టాలి..కేసు పెట్టాలి.., బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలి…అరెస్టు చేయాలి… రేపిస్టులకు అండనా?..బాధితులపై కేసులా? సిగ్గుసిగ్గు…’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ దహనం చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం.సాయిబాబు మాట్లాడుతూ..లైంగిక దాడి ఆరోపణలు వస్తున్నా సొంత పార్టీ ఎంపీ కాబట్టే బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడం లేదని విమర్శించారు. రోజురోజుకీ రెజ్లర్లకు పౌరసమాజం మద్దతు పెరుగుతుం డటం, మరోవైపు కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలతో అనివార్యంగా బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికీ బీజేపీ అతన్ని వెనుకేసుకుని రావడం దుర్మార్గమన్నారు. లైంగిక దాడుల కేసుల్లో అరెస్టులు నివారించడానికి పోక్సో యాక్టును సవరించాలని బ్రిజ్‌భూషణ్‌ డిమాండ్‌ చేయడం దారుణమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు మహిళలంటే చులకనభావమనీ, మహిళలు ఉన్నతస్థాయికి ఎదగడం బీజేపీ ఏమాత్రం ఇష్టముండదనీ విమర్శించారు. బీజేపీ భావజాలమే అదన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దళితులపైనా, మహిళపైనా దాడులు తీవ్రమైపోయాయని చెబుతూ పలు ఉదహరణలు చెప్పారు. మూడు నల్ల చట్టాల కోసం ఢిల్లీలో చేసిన పోరాట స్ఫూర్తినే నేడు రెజ్లర్లు ప్రదర్శిస్తున్నారనీ, వారికి న్యాయం జరిగే వరకూ వారి పోరాటానికి సీఐటీయూ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు మాట్లాడుతూ..ఒలింపిక్స్‌లో దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుముడింపజేసిన రెజ్లర్లు చివరకు తమ పతకాలను గంగపాలు చేసే స్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. నెలన్నర నుంచి ఢిల్లీలో రెజ్లర్లు అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. వారి పోరాటానికి రోజురోజుకీ ప్రజామద్దతు పెరుగుతున్నదన్నారు. క్రీడాకారులు కూడా ఒక్కతాటిపైకి వచ్చి మద్దతునిస్తుండటం మంచి పరిణామం అన్నారు. బ్రిజ్‌భూషణ్‌ అరెస్టు చేసేదాకా ఈ పోరాటం ఆగబోదన్నారు. పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ..జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్ల ధర్నా శిబిరాలను తొలగించడం దారుణమన్నారు. ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు అనుమతినివ్వ కుండా కేంద్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగిస్తున్నదని విమర్శించారు. అయినా రెజ్లర్లు తమ పోరాటాన్ని పట్టుదలతో కొనసాగిస్తున్నారన్నారు. బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ యూనియన్‌ ఉపాధ్యక్షులు జయలక్ష్మి మాట్లాడుతూ..ఢిల్లీలో రెజ్లర్లు మహా పంచాయతీ నిర్వహించేందుకు యత్నించగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ప్రపంచ పోటీల్లో గాయపడ్డ క్రీడాకారిణిని పట్టుకుని తనతో సన్నిహితంగా ఉంటే వైద్య ఖర్చులన్నీ భరిస్తానని బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. బేటీ పడావో..బేటీ బచావో అంటూ మహిళలపట్ల ఇలా వ్యవహరించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి వంగూరు రాములు, కనీస వేతనాల బోర్డు సల హామండలి సభ్యులు జె.మల్లిఖార్జున్‌, సీఐటీయూ ఆఫీస్‌ బేరర్లు ఎస్‌.వీరయ్య, జె.వెంకటేశ్‌, భూపాల్‌, బి.మధు, జె.మల్లిఖార్జున్‌, కె.ఈశ్వర్‌రావు, జె.చంద్రశేఖర్‌, రాజారెడ్డి, ముత్యంరావు, కళ్యాణం వెంకటేశ్వర్లు, వీఎస్‌.రావు, ఏజే రమేశ్‌, బీరం మల్లేశ్‌, గోపాలస్వామి, కూరపాటి రమేశ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.కోటంరాజు, యాటల సోమన్న, పి.సుధాకర్‌, మందా నర్సింహారావు, కుమారస్వామి, ఆర్‌.వాణి, ఎం.చంద్రమోహన్‌, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love