నవతెలంగాణ – మల్హర్ రావు : సెర్ప్ ఉద్యోగులకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మండలంలోని కొయ్యూరులో మండల మహిళ సమైఖ్య సంఘం కార్యాలయం వద్ద తెలంగాణ ఐకేపీ వీఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శిభిరాన్ని ఆయన శుక్రవారం సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతున్న రోజులకు అనుగుణంగా ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. పర్మినెంట్ ఉద్యోగులు అయితే వారికి హెచ్‌ఆర్‌ఏ పెంచుతారని, కానీ ఇలాంటి ఉద్యోగులకు జీతాలు పెంచకపోతే ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు.
ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వేతనాలు పెంచి గౌరవించుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు.20ఏండ్లుగా పనిచేస్తున్న వీఓఏలు కనీస వేతనం రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం న్యాయమేనన్నారు.కాంగ్రెస్ పార్టీ మానీఫెస్టోలో అనేక అంశాలు పెట్టి వాటిని అమలు చేయకుండా విస్మరిస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీలో మంచితనానికి ఎవరూ అతీతులు కారని, సెర్ఫ్‌కు మంత్రిగా ఉన్న సీతక్క అనేక సందర్బాల్లో సెర్ఫ్ ఉద్యోగుల ధర్నా, రాస్తారోకో వద్దకు వచ్చి అనేక మాటలు చెప్పారని ఆయన వివరించారు. ఒక గిరిజన బిడ్డగా ఆకలి కన్నీరు తెలిసిన నాయకురాలైన సీతక్క కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో పూర్తిగా మారిపోయారన్నారు.
రాష్ట్రాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ మానీఫెస్టో రాయించిందన్నారు. రాష్ట్రాన్ని మోసం చేస్తన్న కాంగ్రెస్ కు ఓట్లు వేసిన ప్రజల కోసం ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్బంగా హితవు పలికారు.ఈ మట్టిలో పుట్టిన వాళ్లు,ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న వాళ్లు నాయకులు అయితేనే మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



