రూ.1కోటి విలువైన గంజాయి స్వాధీనం

– అరటన్ను గంజాయిని సీజ్‌ చేసిన పోలీసులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.1 కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి భద్రాచలం ఏఎస్పి పరితోష్‌ పంకజ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…..సోమవారం ఉదయం భద్రాచలం కూనవరం రోడ్‌ చెక్‌ పోస్ట్‌, సి.ఆర్‌.పి.ఎఫ్‌ క్యాంపు వద్ద శ్రీకాంత్‌ ఎస్సై, పోలీస్‌ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా మల్కన్‌ గిరి, ఒరిస్సా రాష్ట్రంనకు చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్‌లో తరలిస్తున్న 485 కిలోల గంజాయినీ పట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులలోగల మల్కణ్‌ గిరి వద్ద నుంచి కరీంనగర్‌ కు భద్రాచలం మీదుగా అక్రమంగా తరలిస్తుండగా రఘునాథ్‌, రబింద్ర అను ఇద్దరినీ పట్టుకోవడం జరిగిందని ఎ.ఎస్‌.పి వెల్లడించారు. మరో ఆరుగురు కూడా ఈ అక్రమ గంజాయి తరలింపులో భాగస్వాములుగా ఉన్నట్లు వెల్లడించారు.
ఒక్కొక్క గంజాయి ప్యాకెట్‌ 5 కిలోల బరువు ఉంటుందని, మొత్తం 97 ప్యాకెట్‌లు ఉంటాయని పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఏఎస్‌పి పేర్కొన్నారు. ఇట్టి గంజాయి తరలింపుకు ట్రాక్టర్‌ ట్రాలీకి సీక్రెట్‌ ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకొని పలుమార్లు విజయవాడ, గుంటూరు, కరీంనగర్‌లలో వీరు అమ్మినట్లుగా ఏఎస్పి తెలిపారు. భద్రాచలం టౌన్‌ సిఐ నాగరాజు రెడ్డి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Spread the love