మోడీ ప్రమాణం రోజున చిరుత..!

Cheetah on Modi's swearing-in day..!– బీజేపీకి సీట్లు తగ్గినా..టాపిక్‌ డైవర్ట్‌ చేయటమే టార్గెట్‌
– విపరీత ప్రచారం కల్పిస్తున్న టీం
– ఇందులో పలువురు జర్నలిస్టులు, న్యాయవాదులు
– కాషాయ ఎజెండాను మోస్తూ ప్రజల మెదళ్లను ప్రభావితం చేస్తున్న వైనం
న్యూఢిల్లీ : మోడీ ప్రమాణ స్వీకారం రోజున చిరుత కనిపించిందంటూ గోడి మీడియా తెగ ప్రచారం చేసింది. బీజేపీ సీట్లు తగ్గి..ఎన్డీఏ సంకీర్ణం ఉంటుందా..అన్న విషయాలపై చర్చ నడిచింది. ఈ టాపిక్‌ను డైవర్ట్‌ చేయటానికి దేశంలోని పలు మీడియా ఛానెళ్లు, వార్తపత్రికలు, అందులోని జరల్నిస్టులు, మరికొందరు స్వయం ప్రకటిత మేధావులు, న్యాయవాదులు.. మోడీకి మెహర్బానీ చాటుకుంటున్నారు. 2014లో మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు.. కొన్ని మీడియా ఛానెళ్లు పని కట్టుకొని మరీ కాంగ్రెస్‌ వంటి ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర విపక్షాలను విమర్శించటం, బీజేపీ ఎజెండాను మోయటం చేశాయి. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయటంలో ఈ మోడీ ‘టీం’ విజయం సాధించింది. అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం ప్రజలు మోడీనే కాదు.. వీరి మాటలనూ నమ్మలేదు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించినన్ని సీట్లను దక్కించుకోలేకపోయినప్పటికీ.. ఎట్టకేలకు సంకీర్ణంతో గట్టెక్కి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించటానికి మోడీ పల్లకి మోస్తున్న ఈ ‘టీం’కు కూడా ఆహ్వానం అందటం గమనార్హం. అయితే, వీరికి ఆహ్వానం అందటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని రాజకీయ విమర్శకులు అంటున్నారు.
ఆప్‌ఇండియా అనే ఒక రైట్‌వింగ్‌ న్యూస్‌వెబ్‌సైట్‌ను నడుపుతున్న నుపుర్‌ శర్మకు కూడా ఆహ్వానం అందింది. ‘హిందూత్వ బ్లాగ్‌’గా పేరు తెచ్చుకున్న ఈ వెబ్‌సైట్‌లో మొత్తం బీజేపీ, మోడీ అనుకూల వార్తలు, హిందూత్వ ఎజెండాను మోస్తూ చేసే ప్రచారమే ఎక్కువ. అయితే, ఈ వెబ్‌సైట్‌ ఎప్పుడూ విద్వేషాన్ని చిమ్ముతుంటుందనీ, అలాంటి బ్లాగ్‌ను నడిపే వ్యక్తికి ఆహ్వానం ఏమిటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు.
సుదర్శన్‌ న్యూస్‌ చీఫ్‌ సురేష్‌ చవాన్కేకు సైతం ఆహ్వానం అందింది. మీడియా పేరుతో ద్వేషపూరితమైన ప్రసంగాలతో చర్చలు నడిపే ఈయన.. ఒక మతాన్ని చెడుగా చూపించటంలో అనేక ప్రయత్నాలు చేశాడు. ఒక మతాన్ని ఆర్థికంగా బహిష్కరించాలని కూడా ఆయన ఒకానొక సమయంలో పిలుపునిచ్చాడు. హిందూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే చంపేస్తానని ప్రమాణాలు కూడా చేశాడు.
భౌగోళిక రాజకీయ, సాధారణ నిపుణుడిగా పేరున్న రోషన్‌ సిన్హా ట్విట్టర్‌కు.. రైట్‌వింగ్‌కి ఇష్టమైన ట్విట్టర్‌ ఖాతా అని పేరున్నది. పాలస్తీనాపై నకిలీ వార్తలు ప్రచారం చేయటంతో తమిళనాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే, వందలాది ఇస్లామాఫోబిక్‌ ట్వీట్లు చేస్తూ విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాడు. మోడీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఉన్న ఇండియా టుడే జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశారు చుట్టూ పారిశుధ్య సిబ్బంది నిలబడి ఉన్న ఫోటోను చూపెడుతూ.. ”పారిశుద్ధ్య సిబ్బంది సరైన స్థలంలో ఉన్నారు” అనే శీర్షికతో రోషన్‌ సిన్హా పంచుకోవటం గమనార్హం.
న్యాయవాదిగా ఉన్న సాయి దీపక్‌ కూడా ఈ టీంలోని వ్యక్తే. పలు డిబేట్లలో హిందూత్వకు, పరోక్షంగా మోడీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తాడనే పేరు ఆయనకు ఉన్నది. అలాగే, ‘స్ట్రింగ్‌ రివీల్స్‌’ అంటూ వివాదాస్పద కంటెంట్‌ను ప్రచారం చేసే వినోద్‌ కూడా ఈ జాబితాలోనే ఉన్నాడు. ఓన్లీ ఫ్యాక్ట్‌ అనే ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ను నడుపుతున్న విజరు పటేల్‌.. ఎక్కువగా లెఫ్ట్‌ భావజాలంతో నడిచే మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు. సదరు సంస్థలను తూలనాడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
ప్రొఫెసర్‌ ఆనంద్‌ రంగనాథన్‌.. కాశ్మీర్‌లో ”ఇజ్రాయిల్‌ లాంటి పరిష్కారం” కోసం పిలుపునిచ్చారు. హిందూత్వను సమర్థించే ఈయన.. మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా డిబేట్లలో పాల్గొంటాడు. ఈయనతో పాటు న్యూస్‌ 18 ఇండియాకు చెందిన అమన్‌ చోప్రా, రూబికా లియాఖత్‌, అమిష్‌ దేవగన్‌లు, టైమ్స్‌ నౌకు చెందిన నవికా కుమార్‌, ఆజ్‌ తక్‌కు చెందిన సుధీర్‌ చౌదరి, చిత్రా త్రిపాఠిలు ఆహ్వానిత జాబితాలో ఉన్నారు. వీరంతా జర్నలిజంలో ఉంటూ మోడీ అనుకూల విధానాన్ని అనుసరిస్తారనీ, వారు చెప్పే వార్తలూ, చేసే డిబేట్లు కూడా దానిని ప్రతిబింబిస్తాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Spread the love