ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదొక ఎన్నికల స్టంట్ అని ఆయన విమర్శించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ… తన కూతురు అరెస్టును స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఖండించలేదని గుర్తు చేశారు. ఆయన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌పై కేసీఆర్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మౌనంగానే ఉన్నారని అన్నారు. వారి మౌనం వెనుక వ్యూహం ఉందన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారని, నిన్న మాత్రం ఈడీ, మోడీ ఇద్దరూ ఒకేసారి వచ్చారన్నారు. బీజేపీ, కేసీఆర్ కుటుంబం కలిసి మద్యం కుంభకోణాన్ని సీరియల్‌లా నడిపించాయని మండిపడ్డారు. కవిత అరెస్ట్ కేవలం బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ఒకరోజు ముందు ఈ పరిణామం జరిగిందని… ఎందుకో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్న సమయంలో తమను దెబ్బతీసేందుకే ఆ రెండు పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

Spread the love