మణిపూర్‌ హింసాకాండపై ఆందోళన

– గోవాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రెండు రోజుల వేటు
పనాజీ : మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినందుకు గోవా అసెంబ్లీ నుంచి మొత్తంగా ఏడుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సోమవారం సభలో ప్రశ్నోత్తరాల సమయం తరువాత మణిపూర్‌ హింసాకాండపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులంతా నల్లటి దుస్తులు ధరించి ఆందోళనకు దిగారు. ‘మణిపూర్‌ సమస్యపై కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టింది, పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీలో చర్చించనవసరం లేదు’ అని స్పీకర్‌ రమేష్‌ తవాడ్కర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు ‘మణిపూర్‌’, ‘మణిపూర్‌’ అంటూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నిం చారు. అధికార సభ్యులు వారిని మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో మార్ష ల్స్‌తో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్‌ బయటకు పంపించారు. అనంతరం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, ఇతర మంత్రులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో కాంగ్రెస్‌, ఆప్‌, గోవా ఫార్వర్డ్‌ పార్టీ, రివల్యూషనరీ గోన్స్‌ పార్టీ ఎమ్మెల్యేలను సోమవారం నుంచి రెండు రోజుల పాటు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. గోవా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభయ్యాయి. ఆగస్టు 10 వరకూ జరగనున్నాయి.

Spread the love