ఢిల్లీ మహిళా మల్లయోధుల శిబిరంపై పోలీసుల దాడిని ఖండించండి

– అరుణోదయ సాంస్కతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన మహిళా మల్లయోధులపై కేంద్ర పోలీసు బలగాలు దాడి చేయడంతోపాటు న్యాయం కోసం వారు ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద 36 రోజులుగా చేస్తున్న దీక్షా శిబిరాన్ని తుడిచి పెట్టేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అరుణోదయ సాంస్కతిక సమాఖ్య ఉభయ రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. మహిళా రెజ్లర్లు 36 రోజులుగా ఆందోళన చేస్తున్నా పార్లమెంట్‌ సభ్యుడు, రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు చేస్తున్నా స్పందించని కేంద్రం వారు పార్లమెంట్‌ వైపు దూసుకువస్తున్నారనే కారణంతో అమానుషంగా ప్రవర్తించడమనేది స్త్రీల పట్ల కొనసాగుతున్న మనువాద భావజాలానికి నిదర్శనమని అన్నారు. అరెస్టు చేసిన క్రీడాకారులను విడదల చేసి, వారిపై మోపిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్ల శిబిరాన్ని పునరుద్దించాలని డిమాండ్‌ చేశారు.
సీపీఐ ఖండన
ఆదివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై పోలీసులు దాడి చేసి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. దేశానికి ఎన్నో పతకాలు, కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన క్రీడాకారులపై ఇలాంటి దమనకాండ సరైంది కాదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ 35 రోజులుగా రెజ్లర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా కేంద్రం అతన్ని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఒకవైపు నూతన పార్లమెంటును ప్రారంభోత్సవం చేస్తూ ఇంకోవైపు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలిపిన మహిళా రెజ్లర్లపై అరాచక పద్ధతుల్లో దాడి చేయడం అత్యంత అమానుషమని విమర్శించారు. భేటీ పడావో, భేటీ బచావో అని చెప్తూనే మహిళలను భక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love