శాటిలైట్‌ సర్వే పేరుతో పోడు రైతుల పొట్ట కొట్టొద్దు

– గ్రామ సభలను విశ్వాసంలోకి తీసుకోవాలి
– సాగుదారులందరికీ పోడు పట్టాలివ్వాలి
నవతెలంగాణ-వైరా
దశాబ్ద కాలంగా పోడు రైతులు సాగించిన ఉద్యమాల ఫలితంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చే దశలో అందుకు రూపొందించిన ప్రమాణాలలో ఒకటైన శాటిలైట్‌ సర్వే ప్రకారం కాక గ్రామ సభల తీర్మానాలను, ఇప్పటివరకు సాగిన ఉద్యమాలలో ప్రభుత్వం, అటవీ అధికారులు గిరిజనులు, పేద పోడు రైతులపై పెట్టిన కేసులను కూడా పరిగణనలోకి తీసుకుని సాగులో ఉన్న గిరిజన, గిరిజనేతర పేదలకు పట్టాలివ్వాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల భూమి పోడు సాగుదారుల చేతిలో ఉందని చేసిన ప్రకటనకు అనుగుణంగా పట్టాల పంపిణీ జరగాలని వీరభద్రం డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2450 గ్రామాలలో పోడు భూములు సాగులో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఒక లక్షా 55,393 మంది పోడు రైతులకు 4లక్షల 903 ఎకరాలను పంపిణీ చేయటానికి సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో పోడు సాగులో ఉండి దరఖాస్తు చేసుకున్న వారు నాలుగు నుండి నాలుగున్నర లక్షల మంది ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా ఒక వెయ్యి 828 మంది రైతులు 3 లక్షల, 42 వేల,482 ఎకరాలు చేసుకుంటూ ప్రభుత్వం నియమించిన జిల్లా, డివిజన్‌ స్థాయి కమిటీలకు దరఖాస్తు చేసుకున్నారని వీరభద్రం తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు రైతులు, పోడు భూములు సాగులో ఉన్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొణిజర్ల, కారేపల్లి, కామేపల్లి, ఏన్కూరు, రఘునాథ పాలెం, పెనుబల్లి, సత్తుపల్లి, చింతకాని, తల్లాడ మండలాల్లో 43,193 ఎకరాలకు 18,487 మంది దరఖాస్తు చేసుకున్నారని వీరంతా గత 60 ఏళ్ల పై బడి సాగులో ఉన్నారని తెలిపారు. వీరిలో 5857 మంది గిరిజన రైతులకు వారు సాగులో ఉన్న భూములకు పట్టాలిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. 12,630 మంది రైతుల దరఖాస్తులను శాటిలైట్‌ సర్వే పేరుతో, గిరిజనేతర రైతుల పేరుతో దరఖాస్తులు తిరస్కరించారని అన్నారు. 33,414 ఎకరాల పంపిణీ నిలిపి వేశారు. దీని వలన గిరిజన, గిరిజనేతర రైతులు నష్టపోతున్నారని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటనకు, పట్టాలిస్తామనే భూములకు పొంతన కుదరటం లేదని అన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే పోడు రైతులపై క్రూరత్వం పెరిగిందని ఆయన విమర్శించారు. అటవీ అధికారుల జోక్యం పెరిగి సాగులో ఉన్న పంటల ధ్వంసం, ఆస్తులను నష్టపెట్టటం, మహిళలను కూడా తీవ్రమైన సెక్షన్‌ ల తో కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించటం ఈ కాలంనే చూశామని అన్నారు. ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌సి కమిటీలను ఏర్పాటు చేయగా దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లో ఆమోదించబడిన వాటిని కూడా తిరస్కరించినట్లు వీరభద్రం తెలిపారు. దరఖాస్తుల ఆమోదానికి 15 అంశాలు ఉన్నప్పటికీ ప్రధానమైన అంశాలను వదిలి కేవలం శాటిలైట్‌ సర్వేపై ఆధారపడి పోడు రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. తొలుత ప్రభుత్వ ప్రకటనలో అడవినే నమ్ముకుని ఏళ్ల తరబడి సాగులో ఉన్న ఇతర పేదలకు కూడా హక్కు కల్పిస్తామని ఆశ చూపి ఇప్పుడు విస్మరిస్తున్నదన్నారు.
కారేపల్లి మండలం ఎర్ర బోడు, మాణిక్యారం 100 మంది రైతులకు చెందిన 200 ఎకరాలు గుంజుకుని అధికారులు మొక్కలు నాటారని, గ్రామ సభలు ఆ భూములు కూడా రైతులకు పట్టా ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. అలాగే చీమలపాడులో 30 మంది రైతుల సేద్యంలోని 90 ఎకరాలను లాక్కున్నట్లు వివరించారు. ఏన్కూరు మండలం మూల పోచారం గ్రామంలో పేద గిరిజన రైతుల సేద్యంలోని 60 ఎకరాలను లాక్కున్నట్లు తెలిపారు. కొంత మంది గిరిజన పోడు రైతులు అటవీ అధికారుల దాష్టీకాలను భరించలేక భూములు వదిలి ఖమ్మం, హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాలకు వలసలు పోయారని అటువంటి వారిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వారి భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దశాబ్ద కాలంలో జిల్లాలో 3000 వేల మందిపై కేసులు పెట్టి వేధించి జైళ్ల పాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నందున సాగులో ఉన్న ప్రతి పోడు రైతుకు పట్టాలివ్వాలని, కేసులు ఎత్తి వేయాలని, సాగులో ఉన్న గిరిజనేతర రైతులకు మూడు తరాల నుంచి ఉన్నవారికి కూడా పట్టాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టంలో పేర్కొన్నట్లు వారి ఆకాంక్షల మేరకు పట్టలివ్వాలని లేకుంటే మరలా పోడు పోరు రగిలే అవకాశం ఉందన్నారు.

Spread the love