ఆ మూడు రోజులు ఢిల్లీ మూత

– సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సదస్సు
– 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవుదినాలు:ఢిల్లీ పోలీసుల సిఫారసు
– రాజధానిలో అంతులేని ఆంక్షలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జీ-20 శిఖరాగ్ర సమావేశం భారత్‌ అధ్యక్షతన వచ్చే నెల 9,10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న దృష్ట్యా దానికి ఒక రోజు ముందు నుంచే రాజధాని నగరాన్ని ఢిల్లీ పోలీసులు భద్రతా వలయంతో దిగ్బంధనం గావించనున్నారు. సెప్టెంబరు 8,9,10 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలను మూసివేయ నున్నారు. ఆ మూడు రోజులు రాజధాని వీధులు జన సంచారం లేక బోసిపోనున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రగతి మైదాన్‌ వద్ద ఇటీవల ప్రారంభించబడిన భారత్‌ మండపం కన్వెన్షన్‌ సెంటరలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. జీ20 అధ్యక్షురాలిగా భారత్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల నిర్వహణకు వేదికగా నిలిచిన ఆయా నగరాల సుందరీకరణ పేరుతో పలు కాలనీలను, ఇండ్లను కూల్చివేశారు. చాలా మంది పేదలను అక్కడి నుంచి బలవంతంగా గెంటేశారు. జీ-20 అనేది జీ-7 ఎలైట్‌ క్లబ్‌గా మారిందంటూ కార్మిక సంఘాల నుంచి, మేధావులు, ప్రజాతంత్ర సంస్థల నుంచి ఈ సమావేశాలు జరిగిన ప్రతి చోటా నిరసన ర్యాలీలు జరిగాయి. కీలకమైన శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఎలాంటి నిరసనలు, అసమ్మతిని అనుమతించరాదని మోడీ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఢిల్లీలో సభలు, సమావేశాలపై ఆంక్షలు పెడుతున్నది. మూడు రోజుల క్రితం సూర్జిత్‌ భవన్‌లో వివిధ కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు కలసి జీ-20కి ప్రత్యామ్నాయంగా ‘విరు-20’ పేరుతో ఏర్పాటు చేసిన సెెమినార్‌ కమ్‌ వర్కుషాప్‌ను అడ్డుకునేందుకు సూర్జిత్‌ భవన్‌ గేటుకు ఢిల్లీ పోలీసులు తాళాలు వేసిన ఉదంతం చూశాం.
సదస్సు తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ ఢిల్లీ పోలీసులు ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తు న్నారు. ఇప్పటికే వివిధ శాఖలకు సమాచారం పం పారు ఆధిపత్యవాద దేశాల మెప్పు పొందేందుకు మోడీ సర్కార్‌ అతిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శిఖరాగ్ర సమావేశం జరిగే మూడు రోజులూ ఢిల్లీలోని విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించనున్నారు. దీంతో పాటు రవాణా వ్యవస్థలపైనా ఆంక్షలు విధిం చనున్నారు. విద్యా బోధనకు ఆన్‌లైన్‌ సేవలను ఉప యోగించుకోవాలని సూచించినట్లు సమాచారం. వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మార్కెట్లు, ఇతర కార్యాలయాల కార్యకలాపాలను ఆ మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేయనున్నారు. ఏడవ తేదీ అర్ధరాత్రి నుంచే కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయి. దేశ, విదేశాలకు చెందిన అత్యంత ప్రముఖులు (వీవీఐపీ) ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించాల్సివుంటుందని తెలిపారు. నిత్యా వసర వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా మిగతా భారీ వాహనాలను ఢిల్లీ నగర పాలక సంస్థ, న్యూఢిల్లీ నగరాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.
ఢిల్లీ విమానాశ్రయం నుంచి 18 హౌటళ్లకు వెళ్లే మార్గాల్లో విదేశీ ప్రతినిధుల రాకపోకలు సాగిస్తారు. వీటిలో 16 హౌటళ్లు ఢిల్లీలోనూ, రెండు హౌటళ్లు గురుగ్రామ్‌లోనూ ఉన్నాయి. హౌటళ్ల నుంచి సభా స్థలం ప్రగతి మైదాన్‌కు, రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్తారు. ఢిల్లీ విమా నాశ్రయం పరిసరాల్లో నిర్దిష్ట సమయాల్లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. విమానాశ్రయం నుంచి వివిధ హౌటళ్లకు, అక్కడి నుంచి సభా ప్రాంగణం ప్రగతి మైదానం వరకు, ఇతర చోట్లకు వాహనాలను నడిపారు. సమీపంలోని ఆస్పత్రులు, మార్కెట్లు, ఆకర్షణీయ ప్రదేశాలు, ట్రాఫిక్‌ పోలీసులు జారీ చేసే సూచనలు, వాహనాల కదలికలు వంటివాటిని అన్ని భాషల్లోనూ తెలియజేసేందుకు ఓ వర్చువల్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Spread the love