ప్రమాదంలో ప్రజాస్వామ్యం: సోనియాగాంధీ

నవతెలంగాణ – జైపుర్‌: దేశ ప్రజాస్వామ్యాన్ని మోడీ నాశనం చేశారని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల క్రమంలో రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో నిర్వహించినసభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలను పెంచి పోషించే విషయంలో ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.‘‘దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది. తనను తాను గొప్పగా భావించుకుంటున్న మోడీ.. దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. నియంతృత్వ పాలనకు సరైన జవాబు చెప్పాల్సిందే’’ అని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రధానిఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. చైనా దురాక్రమణలపై స్పందించడం లేదని విమర్శించారు. రైతులకు ఏం చేశారో చెప్పాల్సినచోట ఆర్టికల్‌ 370 గురించి ప్రస్తావించారని.. రాజస్థాన్‌లోని చురూలో ప్రధాని ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు.

Spread the love