మతరాజ్యంతో సమాజ విచ్ఛిన్నం

బీజేపీతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే ముప్పు
– రాజ్యాంగ సవరణతో అధ్యక్ష తరహా పాలన వచ్చే ప్రమాదం
– ప్రాథమిక హక్కులు రద్దయ్యే అవకాశం
– నిస్తేజంగా మారితే ఫాసిజమే
హైదరాబాద్‌లో ఘనంగా సుందరయ్య 38వ స్మారకోపన్యాసం
బీజేపీకి మెజార్టీ ఉన్నందున పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో అధ్యక్ష తరహా పాలన వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఈ దిశగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది. ప్రాచీన కాలంలో మనుషులంతా సమానం కాదని, పుట్టుకను బట్టే మనుషులను చీల్చిన మూడువేల ఏండ్ల వారసత్వం దేశంలో ఉంది. దీన్నే సనాతన ధర్మ సాంప్రదాయం అంటారు. పవిత్ర గ్రంథాలుగా చెప్పేవన్నీ అమానవీయ విలువలకు పట్టం కట్టేవే. ఇలాంటి ధర్మశాస్త్రాలే ప్రాచీన భారతంలో చట్టాలు. ప్రపంచంలో ఈ దేశంలోనే దేవుడు మనుషులంతా సమానం కాదంటూ స్వయంగా ప్రకటించారు. అటువంటి దేశంలో ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి భావనలను రాజ్యాంగం అందించింది. భారతదేశాన్ని ఆధునిక ప్రపంచంలోకి నడిపించిన ఆయుధం రాజ్యాంగం. దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మెరుగైన పరిపాలన అందిస్తుంది. ఇప్పుడది ప్రమాదంలో పడింది
– లోక్‌సభ పూర్వ సెక్రెటరీ జనరల్‌ పిడిటి ఆచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పిడిటి ఆచారి, బివి రాఘవులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం- సవాళ్లు రాజ్యాంగ విలువలు’అనే అంశంపై స్మారకోపన్యాసంలో ఆచారి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు ఐకాన్‌ సుందరయ్య అని అన్నారు. కేరళలో తాను చదువుకునే రోజుల్లో ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ఏకే గోపాలన్‌, పి సుందరయ్య పేర్లు బలంగా వినిపించేవని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో సుందరయ్య కీలకపాత్ర పోషించారని చెప్పారు.
ప్రతిపక్షాలను శత్రువులుగా భావిస్తున్న పాలకులు
పార్లమెంటు తొలినాళ్లలో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా మాట్లాడేవారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారని పిడిటి ఆచారి గుర్తు చేశారు. ప్రతిపక్షాల నిర్మాణాత్మక సూచనలను గౌరవించేవారని చెప్పారు. విస్తృతంగా చర్చించి చట్టాలను రూపొందించే వారని వివరించారు. అందులో భాగంగానే అనేక చట్టాలొచ్చాయని చెప్పారు. కానీ ఇప్పుడు పార్లమెంటు సమావేశాలే సరిగ్గా జరగడం లేదని, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వడం లేదని, వాయిదాలతో సరిపోతున్నదని అన్నారు. చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయని, చివరికి ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు వంటి వాటిపై ఐదు లేదా పది నిమిషాలు చర్చించి ఆమోదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్ష పార్టీల నాయకులతో ప్రధాని నేరుగా సంప్రదించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ప్రతిపక్ష సభ్యులను శత్రువులుగా భావిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం కార్యనిర్వాహకవర్గం చేతుల్లో బందీ అయ్యిందన్నారు. పార్లమెంటును, ఇతర స్వతంత్ర వ్యవస్థలను అది నియంత్రిస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియాను ప్రభుత్వానికి బాకాగా మారేలా అనేక ఒత్తిళ్లకు గురిచేస్తున్నదని విమర్శించారు. లౌకికత్వంలోనే ఈ దేశానికి మనుగడ సాధ్యమని అన్నారు. మత ఛాంద రాజ్యం అంతిమంగా దేశాన్ని, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం వ్యక్తిగతమని చెప్పారు. పరిపాలనలో మతాన్ని చొప్పించొద్దని కోరారు. మత రాజ్యంతో రాజ్యాంగ విలువలైన లౌకికత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటివి కోల్పోయే ప్రమాదముందన్నారు. ఈ పాలకులకు చరిత్ర అంటే గౌరవం లేదన్నారు. తప్పుడు చరిత్రను సృష్టించడానికి వాస్తవాలను తలకిందులు చేయడానికి నేటి పాలకులు సన్నద్ధులేనని వివరించారు.
ప్రజాస్వామ్యం విలువ అర్థమైతేనే రాజ్యాంగ విలువలను రక్షించుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతారని చెప్పారు. కేంద్రంలో పాలకుల తీరును ఉపేక్షించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరిస్తున్నా స్పందించలేని పరిస్థితికి చేరుకుంటామని అన్నారు. నాగరికత ప్రస్థానంలో ఏ ఒక్క తరం నిస్తేజంగా మారినా ఫాసిస్టు రాజ్యం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి వచ్చే పెనుప్రమాదాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.
బీజేపీని ఓడిస్తేనే దేశం ముందుకు
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌పరివార్‌ కుట్రలను తిప్పికొట్టాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు
బీవీ రాఘవులు
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తేనే దేశం ముందుకెళ్లడం సాధ్యమవుతుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు చైర్మెన్‌ బివి రాఘవులు పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతున్నదని చెప్పారు. మనుధర్మం, ఫాసిస్టు పాలన తేవాలని మోడీ ప్రభుత్వం చూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం ప్రమాదంలో పడ్డాయని అన్నారు. ఎన్నికల కమిషన్‌, పార్లమెంటు, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. ఈ విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మతం, మత విశ్వాసాలను ముందుకు తెస్తున్నదని అన్నారు. దేశంలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సమైక్యతను కాపాడుకోవాలని కోరారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు వాజ్‌పేయి హయాం నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మరోరూపంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నదని చెప్పారు. స్థానిక, రాష్ట్ర అంశాలు చర్చకు రాకుండా జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తే ఫెడరలిజం నాశనమవుతుందన్నారు. వ్యక్తి ప్రాతిపదిక మీద ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అందరి కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌, ట్రస్టు సభ్యులు సి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిడిటి చారి ప్రసంగాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తెలుగులోకి అనువాదం చేశారు.

Spread the love