సుందరయ్య జీవితం యువతకు ఆదర్శం

సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం సుందరయ్య
సుందరయ్య ఆశయాలను కొనసాగించాలి
సుందరయ్యకు ఘన నివాళి
నవతెలంగాణ-దుబ్బాక
సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. భాస్కర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం దుబ్బాక పురపాలిక కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్‌ మాట్లాడుతూ….దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య అని తెలిపారు. పార్లమెంట్‌, అసెంబ్లీలకు సైతం సైకిల్‌పై వెళ్లిన గొప్ప మహనీయుడని, నిరాడంబర వ్యక్తి అని కొనియాడారు. ఆ రోజుల్లో జరుగుతున్న అణిచివేత దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడన్నారు. దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం అంతిమంగా కమ్యూనిస్టు పార్టీతోనే సాధ్యమని నమ్మిన నాయకుడని కొనియాడారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్‌, మతోన్మాద విధానాలతో ప్రజల మధ్యన వైశమ్యాలు రెచ్చగొడుతుందని మండిపడ్డారు. దేశ సంపదను, ప్రజల కష్టాన్ని దోచుకుంటూ కార్పొరేట్‌ ధనవంతులకు దోచిపెడుతున్న దుర్మార్గమైన పాలన నేడు దేశంలో కొనసాగుతుందని విమర్శించారు. బీజేపీ మతోన్మాద విధానాలను ప్రజలందరూ ఐక్యమత్యంగా తిప్పికొట్టాలని కోరారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో సీపీఎం పార్టీని నిర్మించేందుకు కషి చేస్తున్నామని, ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల అసమానతలను నిర్మూలించేందుకు ఐక్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ దుబ్బాక మండల నాయకులు కొంపల్లి భాస్కర్‌, లక్ష్మీనారాయణ, బత్తుల రాజు, బండారి మహేష్‌, మెరుగు రాజు, మల్లేశం, ఎండి సాజిద్‌ తదితరులున్నారు.
నవతెలంగాణ-కొండపాక
పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు అమ్ముల బాల్‌ నర్సయ్య మాట్లాడుతూ సుందరయ్య జీవన విధానంలో అది స్వాతంత్ర సంగ్రామమైనా, తెలంగాణ సాయుధ పోరాటమైన, వాటి నిర్మాణమైన, పార్లమెంటరీ రాజకీయాలైనా, ప్రతి దశలోనూ ఆయన ప్రజలతో మమేకమైన తీరు మనలను ఉత్తేజపరుస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య చూపిన మార్గంలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మూడోజు కనకాచారి, తాటోజు రవీంద్ర చారి, కొమురవెల్లి కనకయ్య, సిఐటియు మండల సహాయ కార్యదర్శి బర్మ కొమురయ్య సీపీఐ(ఎం) పార్టీ వెలికట్ట శాఖ సభ్యులు అమ్ముల పెద్ద పరుశరాములు, కిషన్‌, నర్సయ్య పాల్గొన్నారు
నవతెలంగాణ-బెజ్జంకి
తన పేరులోని ‘రెడ్డి’ పదాన్ని తొలగించుకుని అందరూ సమానమేనని చాటి చెప్పి సమానత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పుచ్చలపల్లి సుందరయ్య నిలిచారని, ఆయన స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్‌ ప్రజలకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద సీపీఐ(ఎం) అద్వర్యంలో సుందరయ్య వర్థంతి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీఐ(ఎం) నాయకులు, స్థానికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుందరయ్య హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జీవనం గడుపుతూ రాజ్యసభకు ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహర్నిశలు పాటు పడ్డారన్నారు. నేటి ప్రజాప్రతినిధులు హంగు ఆర్భాటాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజాప్రతినిధులకు శ్రీనివాస్‌ సూచించారు. సీపీఐ(ఎం)నాయకులు బోనగిరి లింగం, సంగ ఎల్లయ్య, బోనగిరి అంతయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది బోనగిరి లక్ష్మన్‌, సంపత్‌, నర్సయ్య, మొండయ్య, బాలయ్య, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొమురవెల్లి
పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామ్‌ సాగర్‌ సర్పంచ్‌ తాడూరి రవీందర్‌, జిల్లా కమిటీ సభ్యులు కష్ణారెడ్డి, సనాది భాస్కర్‌, అత్తినీ శారద, మండల కమిటీ సభ్యులు తేలు ఇస్తారి, దాసరి చక్రపాణి, రవీందర్‌, పద్మ, విఘ్నేశ్వరి లావణ్య, బాలరాజు, నిర్మల, ఆరుట్ల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-మద్దూరు
మద్దూరు మండల కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు మరువలేవన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-గజ్వేల్‌
పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) గజ్వేల్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీయం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ సుందరయ్య, రెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేరులో రెడ్డిని తొలగించి సాధారణ జీవితం గడిపారన్నారు. తనకు వచ్చిన భూమిని మొత్తం గ్రామంలోని నిరుపేదలకు పంచారన్నారు. చిన్ననాటి నుంచి అంటరాని తనానికి వ్యతిరేకంగా, కూలి పెంపు కోసం 1942లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. మొట్టమొదటి పార్లమెంట్‌ ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉంటూ ప్రభుత్వానికి అనేక సూచనలు సలహాలు చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధునిగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటం చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రంగారెడ్డి, బండ్ల స్వామి, నరసింహారెడ్డి, లింగం వెంకట చారి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-చేర్యాల
కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య చూపిన మార్గంలో మనమంతా నడవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి కోరారు. సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని దళితవాడలో సిఐటియు ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ సుందరయ్య అనుసరించిన మార్గంలో కుల మతాల ను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని ప్రదర్శించాలని, సాటి మానవున్ని గౌరవించి ఆత్మాభిమానంతో గర్వంగా జీవించే పరిస్థితికి భిన్నంగా వ్యవహరిస్తున్న నేటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సుందరయ్య అనుసరించిన బాటలో ముందుకు సాగాలన్నారు. గతంలో దళితులను అంటరానివారని అగ్ర కులాలు వ్యవహరించిన సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య దళితులను ఏకం చేసి క్రమ క్రమంగా మార్పులు తేవడానికి అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలు ముస్లిం మైనార్టీలపై హిందూ దళితులపై అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. కార్మికులు సంఘటితమై పోరాడాలన్నారు. నేడు అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని రాజ్యాంగం స్థానంలో తేవాలని తహతహలాడుతున్నారని ఈ బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మతోన్మాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఇప్పకాయల శోభ, పట్టణ కన్వీనర్‌ రాళ్ల బండి భాస్కర్‌, మండల కన్వీనర్‌ రేపాక కుమార్‌, బోయిని మల్లేశం, దొనికల కనకవ్వ, మేడిపల్లి చం దు, చెక్క యాదగిరి, పొనుగోటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.
నవతెలంగాణ-దుబ్బాక రూరల్‌
దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య సేవలు అనిర్వచనీయమైన సీపీఐ(ఎం) దుబ్బాక మండల కమిటీ సభ్యులు ఎండీ సాధిక్‌ అన్నారు. కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్‌పూర్‌ గ్రామంలో శుకక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ పార్లమెంటకు అసెంబ్లీకి సైతం సైకిల్‌ పైన వెళ్లిన గొప్ప మహనీయుడని, పుచ్చలపల్లి సుందరయ్య నిరాడంబరమైన వ్యక్తి అని కొనియాడారు.ఆనాటి రోజుల్లో జరుగుతున్న అణిచివేత దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం అంతిమంగా కమ్యూనిస్టు పార్టీతోనే సాధ్యమని నమ్మిన నాయకుడన్నారు. కానీ నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పోరేట్‌, మతోన్మాద విధానాలతో ప్రజల మధ్యన చిచ్చుపెడుతూ, దేశ సంపదను కార్పొరేట్‌ ధనవంతులకు దోచిపెడుతున్న దుర్మార్గమైన పాలన దేశంలో కొనసాగుతుందని విమర్శించారు. బిజెపి మతోన్మాదానికి ప్రజలందరూ ఐక్యతతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సాదిక్‌, ప్రశాంత్‌, దినేష్‌ అరవింద్‌ ,అసిఫ్‌ ,యాకుబ్‌ పాల్గొన్నారు.

Spread the love