రాముడి విగ్రహాలకు ముసుగులు తొడగరా?

మార్క్స్‌,లెనిన్‌ విగ్రహాల్ని చూస్తే కమ్యూనిస్టు పార్టీలకు, ఇందిరా, రాజీవ్‌ గాంధీ విగ్రహాల్ని చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి, ఎన్టీఆర్‌ విగ్రహం చూస్తే టీడీపీకి, పెరియార్‌,అన్నాదురై విగ్రహల్ని చూస్తే డిఎంకే పార్టీకి, కాన్షిరామ్‌ విగ్రహం చూస్తే బీఎస్పీకి, వైయస్సార్‌ విగ్రహం చూస్తే వెఎస్సార్‌సీపీకి జనాలు ఓట్లు వేస్తారా? అలాగైతే దేశంలో బీజేపీ వాళ్లు రాముడు, కృష్ణుడు, అయ్యప్పలను హిందూ దైవంగా భావిస్తూ, ఆరాధిస్తూ వారి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఆయా దేవుళ్ల పేరుతో గుళ్లు, విగ్రహాలు నిర్మించారు. వారి పేరు మీద పెండ్లిళ్లు, జయంతి వేడుకలు జరుపుతూ వస్తున్నారు. ఇతర మత దేవుళ్లుగా ఆరాధిస్తూ ఉన్న ఏసుక్రీస్తు, అల్లాను నమ్ముకునే విశ్వాసులను, ‘మీరు విదేశీయులు. మీది విదేశీ మతం. ఈ దేశం నుంచి వెళ్లిపొండి’ అంటూ విద్వేష ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో దేవుళ్లనయితే ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు కదా. దేశంలో ప్రతి గల్లీగల్లీలో ఆయా దేవుళ్లు అయిన రాముడు, కృష్ణుడు, అయ్యప్ప, ఆంజనేయ, సాయిబాబా వంటి దేవుళ్ల విగ్రహాలు, వారి పేరు మీద గుడులు కూడా ఉన్నాయి. అలాగే రోడ్డు మీద బాబాలు, స్వాములు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, జ్యోతిష్య పండితులు రోడ్డు మీద బహిరంగంగానే తిరుగుతూ ఉన్నారు. సమాచార, ప్రసార మాధ్యమాల్లో భక్తి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ వేసే కార్యక్రమానికి బయలు దేరడానికి ముహూర్తం చూసుకుంటున్నారు. జాతకం చూసే వాళ్లు పూజలు, ప్రార్థనలు చేస్తున్న మహానుభావులూ ఉన్నారు. వారిపైన ఎలాంటి చర్యలు ఉండవా? మత ప్రాతిపదిక జరుగుతున్న బీజేపీ ప్రచారం చూస్తే వారు ఆరాధించే విగ్రహాలకు కూడా ముసుగులు తొడగాలి. గుడులు, గోపురాలను కూడా ఎన్నికలయ్యే వరకు మూసేయాలి. ఎన్నికల సంఘం ఈ దృష్టితో ఆలోచన చేయాలి.
– మోతుకూరి అరుణ్‌కుమార్‌,
99480 24789

Spread the love