వృద్ధిరేటు ఆరాధన నిరర్ధకం

వృద్ధిరేటు ఆరాధన నిరర్ధకంఆధునిక కాలంలోని ఉదారవాద మేధావులలో అగ్రగణ్యులలో జాన్‌ స్టువర్ట్‌ మిల్‌ ఒకరు. ఆర్థికశాస్త్రం గురించి, తత్వశాస్త్రం గురించి ఆయన చాలా ఎక్కువగా రచనలు చేశాడు. జీవితపు చివరిదశలో తన భార్య హారియట్‌ టైలర్‌ మిల్‌ ప్రభావంతో సోషలిజం వైపు దగ్గరయ్యారు. అయితే అతడిని ఎక్కువగా ఆకర్షించింది సహకార సోషలిజం. ఏదేమైనా, ఉదారవాద మేధావులలో అగ్రగణ్యుడిగా అతడిని పరిగణిస్తారు. మిల్‌ కాలం నాటి ఆర్థికవేత్తలను ఒక భయం వెంటాడుతూ వుండేది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక దశలో అనివార్యంగా ఉత్పత్తిలో వృద్ధి నిలిచి పోయి, అదే స్థాయిలో ఉత్పత్తి కొనసాగుతుంది అన్నదే వారి భయం. దానివలన అదనంగా పెట్టుబడి పోగుబడదు. అయితే మిల్‌ మాత్రం అటువంటి ఎదుగూ బొదుగూ లేని దశ గురించి పెద్ద ఆసక్తి చూపలేదు. దానికన్నా ఆర్థికవేత్తలు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆదాయాలను మరింత మెరుగుగా పంపిణీ చేయ డం మీద, కార్మికులకు ముట్టే ప్రతిఫలాన్ని అంతకంతకూ పెంచడం మీద దృష్టి పెట్టడం ప్రయోజనకరం అని అతడు సూచించాడు. దానిని పక్కనబెట్టి నిరంతరం ఉత్పత్తిలో వృద్ధి కొనసాగించడం మీదనే కేంద్రీకరించడం వలన ఉపయోగం ఉండదని భావించాడు.
ఆనాటి ఉదారవాద ఆర్థికవేత్తల వైఖరితో పోల్చితే అందుకు పూర్తి భిన్నంగా నేటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు, భారతదేశంతో సహా వివిధ జాతీయ ప్రభుత్వాలు జీడీపీ వృద్ధిరేటు మీదనే దృష్టిని కేంద్రీ కరిస్తున్నాయి. ఒకపక్క పేదరికం వేగంగా పెరుగుతోందని అనుభవాలు తెలుపుతున్నా, ఆదాయాల పున:పంపిణీ గురించి కాని, వేతనాల పెంపుదల గురించి కాని ఆనాటి ఉదారవాద ఆర్థికవేత్తలు చేసిన సూచనలను కూడా ఏమాత్రమూ పట్టించుకోడం లేదు. ఒకప్పుడు మన వంటి దేశాలలో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తగ్గించడానికి అధిక వృద్ధిరేటు సాధించడం అవసరం అన్న అభిప్రాయం ఉండేది. ఉత్పత్తిలో పెరుగుదల సాధించడానికి, కార్మికుల వేతనాలను పెంచడానికి నడుమ ఎటువంటి ఘర్షణా లేదని భావించేవారు. అధిక వృద్ధిరేటు సాధిస్తే, అది ఉపాధి అవకాశాలు పెరగడానికి దారి తీస్తుందని, దానివలన నిరుద్యోగ సైన్యం తగ్గడమే గాక, కార్మికుల అవసరం పెరుగుతుందని, దాని ఫలితంగా కార్మికుల వేతనాలను కూడా పెంచవలసి వస్తుందని భావించేవారు.
అయితే ఈ అభిప్రాయంలో పస లేదు. ఉత్పత్తి వృద్ధిరేటు పెరడం అనేది మాత్రమే చూస్తే సరిపోదు. ఆ వృద్ధి స్వభావం ఏమిటన్నది కూడా చూడాలి. ఏ సరుకుల ఉత్పత్తిలో వృద్ధి ఉంది, ఏ రంగాలలో వృద్ధి ఉంది, ఏ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఆ వృద్ధి ఉంది అన్నది కూడా చూడాలి. ఒకవేళ వ్యవసాయం, చిన్న ఉత్పత్తుల రంగం వంటి రంగాలలో వృద్ధి గనుక జరిగితే అది గణనీయంగా ఉపాధి అవకాశాలను పెంచుతుంది. కాని నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, చిన్న ఉత్పత్తుల రంగం నిరంతరం సంక్షోభంలోనే కొట్టు మిట్టాడుతూ వుంటాయి. అంతే కాదు. అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా, దేశంలో ఆర్థిక మిగులు మీద బతికేవారి (సంపన్నులు) వినిమయ అవసరాలకు అనుగుణంగా వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాలలో ఉపాధి కల్పనకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైగా నిరంతరం కొత్త కొత్త మోడల్స్‌ మార్కెట్‌ లోకి దిగుతూ, కొత్త టెక్నాలజీని వాడుతున్నందు వలన ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతూపోతాయి. అంటే నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో జీడీపీ వృద్ధిరేటు అధికంగా ఉన్నా, ఉపాధి అవకాశాలలో పెరుగుదల స్వల్పం గానే ఉంటుంది. ఒక్కోసారి ఉత్పత్తి పెరుగుదలలో స్వల్ప శాతం మేరకు కూడా ఉపాధి అవకాశాలు పెరగవు. దీనినే మనం ఉపాధి రహిత అభివృద్ధి అంటాం.
ఇంకోవైపు జనాభా పెరుగుతూ వుంటుంది. దానితోబాటు కార్మికజనం సంఖ్య పెరిగిపోతూ వుంటుంది. అందుచేత నయా ఉదారవాద వ్యవస్థలో వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నా, దానివలన కలిగే అదనపు ఉపాధి అవకాశాలు అత్యల్పంగా ఉండడంతో ఉన్న ఉద్యోగాల సంఖ్యతో పోల్చినప్పుడు నిరుద్యోగుల సంఖ్య సాపేక్షంగా తగ్గకపోగా మరింత పెరిగిపోతుంది. దాని ఫలితంగా పని చేస్తున్న కార్మికుల వేతనాలు సైతం పెరగకపోగా తగ్గడం మొదలౌతుంది. ఆ విధంగా కార్మికవర్గం మరింత పేదరికంలోకి దిగజారిపోతుంది.
ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నదిదే. ప్రపంచంలోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఉందని చెప్పుకుంటున్నాం. కాని అదే సమయంలో మన దేశంలో పేదరికంలో మగ్గి పోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా, మోడీ హయాంలో పేదరికం మరింత ఎక్కువగా పెరిగిపోతోంది. మోడీ అనుసరించే విధానాలకి నయా ఉదారవాద విధానాలే మొత్తంగా సంక్షోభంలో పడడం తోడైంది. ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వాలు ఇంకా వృద్ధిరేటు పెంచడం గురించే ఎందుకు పాకు లాడుతున్నాయి? సంపద వ్యత్యాసాలను తగ్గించడం గురించి, వేతనాల వాటా పెంచడం గురించి మిల్‌ వంటి ఆర్థికవేత్తలు సూచించిన దానిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది మొదటి ప్రశ్న. పేదరికం పెరుగుతున్న కొద్దీ దేశంలో స్థూల డిమాండ్‌ తగ్గిపోతున్నది. అటువంటప్పుడు వృద్ధిరేటును కొనసా గించడం ఏవిధంగా సాధ్య పడుతుంది? ఇది రెండో ప్రశ్న.
మొదటి ప్రశ్నకు సమాధానం తేలికే. నయా ఉదారవాదం మిల్‌ వంటి ఆర్థికవేత్తలు చెప్పిన సూచనలను అంగీకరించదు. నయా ఉదారవాద వ్యవస్థలో సరుకుల, సేవల సంచారం, పెట్టుబడి సంచారం ఎటువంటి ఆంక్షలూ లేకుండా దేశాల ఎల్లలు దాటి యథేచ్ఛగా సాగిపోతూ వుంటాయి. దీని పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకునే తీరులో మార్పు వస్తుంది. అంతవరకూ ప్రభుత్వ జోక్యంతో కార్మికులకు ఆదాయాలు వున్న దాంట్లో కాస్త మెరుగ్గా పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం కార్మికుల తరఫున ఏవిధంగా జోక్యం కల్పించుకున్నా దానిని నయా ఉదారవాదం అంగీకరించదు. అందుచేత ప్రభుత్వం ఇప్పుడు వృద్ధిరేటును పెంచడం గురించే మాట్లాడుతూ వుంటుంది. ఆ సాకుతో కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చే తన చర్యలను సమర్ధించుకోవచ్చు. మరోపక్క వృద్ధిరేటు పెరిగితే ఆటోమేటిక్‌గా ఉపాధి అవకాశాలు పెరిగిపోతాయన్న భ్రమను కూడా ప్రచారంలో పెడుతుంది. ఈ వాదన వాస్తవమా కాదా అన్నది నయా ఉదారవాద వ్యవస్థకు అనవసరం. దానితో నిమిత్తం లేకుండా ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌, మన ప్రభుత్వం వంటి నయా ఉదారవాద ప్రభుత్వాలు ప్రచారం చేసే ఆర్థిక సిద్ధాంతం ఇది.
ఇక రెండో ప్రశ్న: అసమానతలు, పేదరికం పెరిగిపోతే దాని ప్రభావం తప్పకుండా జీడీపీ వృద్ధిరేటు మీద పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేడు నయా ఉదారవాదం సంక్షోభంలో పడింది ఇందుకే. దీనివల్లనే ఇప్పుడు వాళ్ళకి దిక్కు తోచడం లేదు. ఎలా బయటపడాలో తెలియడం లేదు. డిమాండ్‌లో పెరుగుదల నిలిచిపోవడంతో అది అధికోత్పత్తికి దారితీసింది. ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా నెలకొని వుంది.
మాజీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌. అశోకా మోడీ, ప్రణబ్‌ సేన్‌ (ఇతడు మాజీ ప్రధాన గణాంకాధికారి) వంటి అనేకమంది నిపుణులు మన దేశ వృద్ధిరేటును అతిగా అంచనా వేస్తున్నారన్న సంగతిని అంగీకరిస్తున్నారు. ఎందుకు ఆ విధంగా అతి అంచనాలు వేయడం జరుగుతోందన్న విషయంపై వీరంతా తలా ఒక కారణం చూపిస్తున్నారు.వాటి మాటెలాగున్నా, అతి అంచనా వేయడం జరుగు తోందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. ఉన్న వృద్ధి రేటుకన్నా ఎంత ఎక్కువగా ఈ అంచనాలు ఉంటున్నాయి అన్నది ఇక్కడ ప్రశ్న. వీరిలో కొందరు వున్న వృద్ధి కన్నా సుమారు 2 శాతం అదనంగా వృద్ధి ఉన్నట్టు చూపిస్తున్నారంటూ చెప్తున్నారు. వీరంటున్నదానిని బట్టి చూసినా ఇప్పటి వృద్ధిరేటు నయా ఉదారవాద పూర్వపు దశ లోని వృద్ధిరేటు కన్నా పెద్ద ఎక్కువేమీ కాదు. దాని గురించి చెప్పుకోడానికేమీ లేదు.
ఇక్కడ ఏ స్థాయిలో వృద్ధిరేటు ఉంది అన్న అంశం కన్నా, వృద్ధిరేటు పెరుగుదల వేగం తగ్గుతున్నది ఏ రేటులో ఉంది అన్నదే ప్రధానాంశం. అధికారిక గణాంకాలను బట్టి చూద్దాం. 2001-2012 మధ్య కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల విలువ ఏడాదికి 6.7 శాతం చొప్పున పెరుగుదల నమోదు చేసింది. 2012-2019 మధ్య కాలంలో (అంటే కోవిడ్‌ మహమ్మారి ప్రభావం పడే ముందు వరకూ) ఈ పెరుగుదల రేటు 5.4కి పడిపోయింది. కోవిడ్‌ ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకున్న అనంతరం, అంటే 2022-23 నాటికి ఈ వృద్ధిరేటు ఇంకా 5.4 శాతమే వుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నది.
ఈ మాంద్యం ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. ఆదాయాల అసమానతలు పెరిగిపోతూ, మిగులులో కార్మికుల వాటా తగ్గిపోతూ వున్నప్పుడు దేశంలో స్థూల డిమాండ్‌ పడిపోతుంది. పెట్టుబడిదారుల దగ్గరకు చేరిన అదనపు సంపదను వాళ్లు మళ్లీ పెట్టుబడి పెట్టి సంపద వృద్ధికి తోడ్పడతారు అని ఆశించడం ఇప్పటి పరిస్థితుల్లో అవాస్తవికమే ఔతుంది. సరుకులకు డిమాండ్‌ తగినంత పెరుగుతున్నప్పుడే ఏ పెట్టుబడిదారుడైనా అదనంగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతాడు. లేదా ప్రభుత్వం జోక్యం కల్పించుకుని అదనంగా వ్యయం చేయడానికి సిద్ధపడాలి. నయా ఉదారవాద వ్యవస్థ ప్రభుత్వ జోక్యాన్ని అనుమతించదు. పేదరికం పెరుగుతున్నకొద్దీ అదనపు డిమాండ్‌ తగ్గుతుందే తప్ప పెరగదు. అందుచేత కార్పొరేట్లు దేశ ఆర్థిక వృద్ధిరేటు వేగాన్ని పెంచే సాధనాలుగా వ్యవహరిస్తారు అని చేసే వాదన కొరగానిది. అందుచేత జీడీపీ వృద్ధిరేటు పట్ల ఆరాధన కలిగివుండడం వలన అది నయా ఉదారవాద వ్యవస్థలో పేదరికం పెరుగుదలనేమీ అరికట్టలేదు. కనీసం వున్న వృద్ధి రేటునైనా పడిపోకుండా నిలబెట్టనూ లేదు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love