భగత్‌సింగ్‌ దార్శనికత

భగత్‌సింగ్‌ దార్శనికతఎన్నికల ప్రచారంలో అన్ని పరిధులను అతిక్రమించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా నిర్వీర్యం చేసిన మోడీ తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా చెల్లుతుందని అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారు. గత ఆదివారం ఆయన రాజస్థాన్‌లో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ అబద్దాలతో మతప్రాతిపదికపై ఓటర్లను రెచ్చ గొట్టారు. ‘కాంగ్రెస్‌ గనక ఎన్నికల్లో గెలిస్తే మన తల్లుల మెడల్లోని మంగళసూత్రాలను లాగి ముస్లింలకు ఇచ్చేస్తారు. దేశంలోని ప్రజల ఆస్తులన్నింటికి ముస్లింలే యజమానులని కాంగ్రెస్‌ చెప్తుంది. కనుక ప్రజల ఆస్తులన్నీ ముస్లింలకు ధారబోస్తారని’ ఆరోపించారు. దేశంలోని ఆస్తులపై, వనరులపై కష్టజీవులకు, ముస్లింలతో సహా బలహీన వర్గాలకు హక్కు ఉందని 18 ఏండ్ల్ల క్రితం ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలకు ఘోరమైన అబద్ధం జోడించి మన ‘విశ్వగురువు’ పైన చెప్పిన విధంగా వ్యాఖ్యనం చేశారు. ‘ఎవరికి ఎక్కువ పిల్లలుంటారో వారికే సంపదను కట్టెబెట్తారన్న మాట’ అని అన్నారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి గెలవడం ఒక్కటే మోడీకి తెలుసు ఈ సందర్భంగా గుజరాత్‌ అల్లర్ల తర్వాత మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలి. నిరాశ్రయులైన ముస్లింల కోసం ఆ సమయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సౌకర్యాల గురించి అడిగితే ఇక్కడ పిల్లలు పుట్టించే యంత్రం ఏమైనా ఏర్పాటుచేయాలా? అని ముఖ్యమంత్రి మోడీ ఎదురు ప్రశ్న వేశారు. కుటుంబ సభ్యులను, ఆప్తులను, ఆస్తులను, సర్వస్వం కోల్పోయిన వారి విషయంలో కూడా ఆయన ఎంతటి నీచ రాజకీయం చేయగలరో ఆనాడే వెల్లడయింది. నిజానికి దేవంలో ఇతర జనాబాతో పోల్చినప్పుడు ముస్లింల జనాభా తగ్గుతోంది. ప్రధానిగా ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు, అయినప్పటికీ రాజస్థాన్‌ సభలో ఆయన ముస్లింలు ఎక్కవమంది పిల్లల్ని పుట్టిస్తుంటారన్న అబద్ధంలా చెప్పేశారు. ప్రధాని వంటి అత్యున్నత స్థానంలోని వంటి వారు ఎవరూ ఇలాంటి దుర్మార్గానికి పూనుకొని ఉండరు. ఈ స్థాయికి దిగజారి ప్రచారం చేయడం చూస్తే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నట్లు అనిపిస్తున్నది. ఎన్నికల నియమాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన ఇంత బరితెగించే వారు కాదు. ఎన్నికల సంఘం సభ్యుల ఎంపిక ప్రక్రియను మార్చిన నాడే బీజేపీ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉండబోతుందో వెళ్లడయింది. సభ్యులను ఎంపిక చేసే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి అత్యున్నత హోదాను మోడీ ఘోరంగా అవమానించారు. ఆ కారణంగా హోంమంత్రి అమిత్‌ షా ఎంపిక కమిటీలోకి వచ్చారు. తన ముందుకు వచ్చిన కేసుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించి నిలేసిన కొన్ని సందర్భాల్లో కేంద్రం నిర్ణయాలను రాజ్యాంగ వ్యతిరేకమంటూ కొట్టేసినందున మోడీ చీఫ్‌ జస్టిస్‌ను అవమానించడానికి పూనుకొన్నారన్నది స్పష్టం. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఎన్నికల సంఘాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి కూడా మోడీకి దాని వల్ల అవకాశం లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం పట్ల గతంలో ఏ ప్రభుత్వం ఇంత అవమానకరంగా ప్రవర్తించలేదు.
దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలర్పించిన అమరవీరుడు భగత్‌సింగ్‌ దాదాపు వందేళ్ల క్రితమే భారతదేశాన్ని మున్ముందు మతోన్మాదులు పాలించే అవకాశం ఉందని హెచ్చరించారు. 1928 ఆనాటి ప్రముఖ నాయకులైన సుభాష్‌ చంద్రబోస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూల ఆలోచనల మధ్య ఉన్న వైవిధ్యాన్ని వివరిస్తూ ‘కీర్తి’ పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఆ రెండు ప్రముఖ స్రవంతులు కాక మరో ప్రమాదకర స్రవంతి కూడా దేశ రాజకీయాల్లో ఉందని హెచ్చరించారు. ఆ స్రవంతి ఆనాటికి ప్రముఖమైంది కాకపోయినా అది సష్టించగల ప్రమాదాన్ని భగత్‌ సింగ్‌ ఆనాడే అంచనా వేసి చెప్పారు. మార్క్స్‌, లెనిన్‌లతో పాటు ఆనాటి ప్రపంచ ప్రఖ్యాత రచనలను, ఇటలీ, ఫ్రాన్స్‌, రష్యాల్లో వచ్చిన ఉద్యమాలను లోతుగా చదివిన భగత్‌సింగ్‌ మన దేశంలోని రాజకీయ, సామాజిక స్థితిగతులపై స్పష్టమైన అంచనాలకు రాగలిగారు. భారతదేశాన్ని సుభాష్‌ వేదకాలం నాటి స్థితికి తీసుకెళ్లాలని భావిస్తారని, నెహ్రూ ఆధునిక దక్పధం గలవాడని జాతీయ వాదం స్థాయిని దాటి అంతర్జాతీయ వాద సౌభ్రాతృత్వాన్ని కోరే వ్యక్తి అని అన్నారు. ఈ రెండు దక్పధాలతో పాటు మరో దక్పధం కూడా దేశంలో ఉందని వెల్లడించారు.
ఆనాటికి అంతగా ప్రముఖుడు గాని సాధు వాస్వానీ అనే వ్యక్తి గురించి భగత్‌ సింగ్‌ ప్రస్తావించారు. అతనికి భారత రాజకీయాల్లో ఎలాంటి ప్రత్యేక లేదు. అయినప్పటికీ భవిష్యత్తులో దేశ వ్యవహారాలను నడపవలసిన వారు ఆయన వల్ల ఆయన నడిపే ‘భగతీ యువ సంఫ్‌ు’ ఉద్యమం వల్ల ప్రభావితులవుతన్నారు అని భగత్‌ సింగ్‌ హెచ్చరించారు. అతని ఆలోచనలు పూర్తిగా భిన్నమైనవి. పూర్తి తిరోగామి దృక్పధం గలవి. దేవుడు జ్ఞానాన్నంతటినీ వేదాల్లో నిక్షిప్తం చేశారని ఆయన బోధనల సారాంశం. వేదాలకు మించిన అభివద్ధి ఉండదు. ప్రపంచం ఎప్పుడూ వేదాలను మించి ముందుకెళ్లలేదు. వెళ్లదు కూడా అని అతని వాదన. నాయకులు మజ్జిని, వోల్టేర్లను తమ ఉపదేశకులుగా స్వీకరించారు. వారు లెనిన్‌ టాల్‌స్టారు నుండి పాఠాలు నేర్చుకొన్నారు అంటూ ప్రపంచ విప్లవాలను వాస్వాని నిందించే వాడు. తన వ్యాసంలో వాస్వాని వాదనలను భగత్‌సింగ్‌ వివరిస్తూ భావి భారతంలో ఆయన వాదనలు ఎలాంటి ప్రమాదం సృష్టించగలవో సరిగ్గా అంచనా వేశారు. వాస్వాని భావనలు ఈనాటి దేశ రాజకీయ రంగంపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం చూపకున్నా అవి యువకులను ప్రభావితం చేస్తాయి. ఆ యువకులే రేపటి భారతదేశ పగ్గాలు చేపట్టవచ్చు అని భగత్‌సింగ్‌ హెచ్చరించారు. ఆయన హెచ్చరించినట్లుగానే వాస్వాని శిష్య పరంపరలోని నరేంద్ర మోడీ నేడు దేశ ప్రధాని అయి కూర్చున్నారు. ఆయన భారతదేశ పురోగతిని కేవలం కొందరు ఆశ్రితుల పరం చేసి ప్రజలను తిరోగతిలోకి మళ్లించడానికి అతి తేలికగా అబద్ధాలు చెప్తూ మెజార్టీ ప్రజల భావాలను నియంతృత్వం నెలకొల్పగలరు.
అదే సంవత్సరం అంటే 1928 ఏప్రిల్‌ 11 నుండి 13 వరకు లాహోర్‌లో జరిగిన నౌ జవాన్‌ భారత్‌ సభ సమావేశాల్లో ఆమోదం పొందటానికి, భగవతి చరణ్‌ వోహ్రూతో కలిసి భగత్‌సింగ్‌ ఒక ప్రణాళికను రాశారు. అందులో మత విశ్వాసాల వల్ల మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పారు. హిందువుల్లోనే కాదు ముస్లింల్లోనూ అవి ఏ మోతాదులో ఉన్నాయో చెప్పారు. ”మనదేశంలో ఎవడైనా రావిచెట్టు కొమ్మ నరికితేచాలు మా మనోభావాలకు దెబ్బ తగిలిందని హిందువులు గొడవ చేస్తారు. మోహర్రం లోని పీరుకు అంటించిన కాగితం ఒక మూలన చినిగిపోతే చాలు ముస్లింలు గొడవచేస్తారు. తమ అల్లా ఆగ్రహిస్తాడని అంటారు. జంతువులకంటే మనిషికి ప్రాధాన్యం దక్కాలి. కానీ మన భారతదేశంలో పవిత్ర జంతువుల పేర మనుషులు తలలు పగలగొట్టుకొని చస్తారు” అని భగత్‌సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ”మత సంబంధ మూఢనమ్మకాలు మన పురోగతి ఆటంకమని ఎన్నోసార్లు రుజువైంది. ఆ ఆటంకాలను పక్కకు నెట్టేయాలి. మనిషి స్వేచ్ఛగా ఆలోచించడానికి అడ్డుపడేవన్నీ నాశనం కావాలి. అలాంటి ఎన్నో బలహీనతలను మనం అధిగమించాల్సి ఉంది. మన దేశంలో అన్ని మతాలకు ఉన్న సంకుచిత దక్పధం వల్ల మనల్ని విదేశీ శత్రువు దోచుకుంటున్నాడు.” అని భగత్‌ సింగ్‌ ఆ ప్రణాళికలో చెప్పారు. విదేశీ శత్రువు నుండి విముక్తి సాధించడానికి అన్ని మతాల్లోనే యువజనులు విప్లవోత్సాహంతో ముందుకు రావాలని ఆయన కోరారు.
వందేండ్ల క్రితం భగత్‌ సింగ్‌ ఎలాంటి పరిస్థితిని ఊహించి హెచ్చరించారో అదే స్థితి ఈ రోజు మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. విస్తత ప్రజానీకంపై అన్ని రకాల భారం పెంచిన మోడీ ఎన్నికల ముందు కొత్త గ్యారంటీలతో ఊదరగొట్టారు. తాను ఎంత ఊదరగొట్టినా జనంలో సానుకూల స్పందన లేదని అర్థమయినట్లుం ది. అన్ని హద్దులూ దాటి ముస్లింలపైకి హిందువులను రెచ్చగొట్టి ఆ ఉద్రిక్తతల మధ్య ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. తాను ఈ దేశానికి ప్రధాని అన్న స్పృహను గట్టున పెట్టి ఎన్నికల రంగాన్ని మతోన్మాదంతో కలుషితం చేయడానికి పూనుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బ్యాంక్‌ అకౌంట్లను స్తంభింపజేయడం, ప్రత్యర్థులపై ఇడి, విజిలెన్స్‌, సిబిఐ, ఎన్‌ఐఏ ల చేత కేసులు పెట్టించడం. ఎన్నికలకు ముందు ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులనే జైలుకు పంపడం. విచారణ లేకుండా మేధావులతో సహా అమాయకులైన దళితులను, ఆదివాసీలను ఏళ్ల తరబడిగా జైల్లో ఉంచడం. ఆదివాసీల కోసం పనిచేస్తున్న స్టాన్‌ స్వామి లాంటి వద్ధుడు జైల్లో చనిపోతున్నా పట్టించుకోకపోవడం డయాబెటిక్‌ రోగి అయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యంతో ఆటాడుకోవడం వంటి దురాగతాలేన్నో మోడీ ప్రభుత్వంలో జరిగాయి, జరుగుతున్నాయి. ‘న్యూస్‌ క్లిక్‌’ డిజిటల్‌ చానెల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థపై ఉపా చట్టం కింద కేసు బనాయించి విచారణ పేరుతో 2021 నుంచిి జైల్లో ఉంచింది. కొందరు జర్నలిస్టులు విదేశాలకు వెళ్లి తలదాచుకొన్నారు. మీడియాను తమ కబంధ హస్తాల్లోకి తీసుకొని స్వేచ్ఛను హరించారు. వృద్ధుడైన వరవరరావు కండిషనల్‌ బెయిల్‌ మీద ముంబాయి నుంచి కదలలేని స్థితిలో ఉన్నారు. మతంలోనే నిరంకుశ లక్షణం ఉంది. మతంలో హేతుబద్ద ఆలోచనలకు అవకాశం లేదు. మతంతో పాటు నిరంకుశత్వం తప్పదు. మత ప్రమాదాన్ని వందేండ్ల క్రితమే అంచనా వేసి చెప్పిన గొప్ప దార్శనికుడు భగత్‌సింగ్‌. దేశంలో ఈ దుస్థితికి రావడానికి కారణం స్వాతంత్య్ర పోరాట కాలం నుంచీ రాజకీయాల్లో ఉన్న అందులోని సాంప్రదాయవాదులు, ఆధిపత్య వర్గాలు కారణం. ఆ ఆధిపత్య వర్గాలు నేడు బీజేపీలో ఉన్నాయి. అవకాశ వాదులు బీజేపీ దేశానికి తెస్తున్న ప్రమాదాన్ని విస్మరించి తమ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరుతున్నారు. దోస్తీ చేస్తున్నారు. బీజేపీతో పాటు అలాంటి ఆషాడ భూతులను ఈ ఎన్నికల్లో ఓడిస్తే తప్ప భారత దేశానికి భవిష్యత్తు ఉండదు.
ఎస్‌ వినయ కుమార్‌
99897 18311

Spread the love