రష్యా, చైనాలపై యుద్ధం చేసే సత్తా అమెరికాకు ఉందా?

– నెల్లూరు నరసింహారావు
పశ్చిమ దేశాల మీడియా తలపై పెట్టుకుని ఊరేగిన ఉక్రెయిన్‌ ప్రతిదాడి ఈ సంవత్సరం జూన్‌ లో మొదలై మూడు నెలలుగా తడబడుతుండటం ప్రపంచానికి తెలిసిపోయింది. అయితే ఈ ప్రతిదాడి ఉక్రెయిన్‌ సైనిక దళాల పరిస్థితినే కాకుండా ఈ యుద్ధాన్ని వెనుక నుంచి నడుపుతున్న అమెరికా బలహీనతను కూడా బహిర్గతం చేసింది. ఇదేదో ఆకస్మికంగా జరిగిన విషయమేమీ కాదు. లక్షలాది కోట్ల రక్షణ బడ్జెట్ల దన్ను ఉన్నప్పటికీ ఒక బలమైన దేశంతో యుద్ధం చేయటం అమెరికాకు అంత తేలిక కాదని అనేక విశ్లేషణా నివేదికలు పదేపదే తెలియజేస్తూనే ఉన్నాయి. ఏదో ఒక మూడవ ప్రపంచ దేశాన్ని కాకుండా ఒక బలమైన శత్రువుతో తలపడినప్పుడు సూటిగా లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, గూఢచర్యం, లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం ఉండటంతోనే అమెరికాకు సరిపోదని అనేకమంది నిష్ణాతులు చెప్పారు. సోవియట్‌ యూనియన్‌ పతనం తరువాత అమెరికాకు శత్రుశేషం అంటూ లేకుండా పోయింది. రష్యా ప్రధాన శత్రువు పాత్రను ధరించలేదు. చైనాకు పారిశ్రామికంగా అభివ్రుద్ధి చెందాలనే యావతప్ప అమెరికాతో పోటీపడే ఆలోచనే లేదు. దానితో అమెరికా సైన్యం సంఖ్యాపరంగా కుదింపుకు గురవటమే కాకుండా అమెరికాకు అంతకుముందున్న ఆయుధ సంపత్తికూడా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. వేలకువేల ట్యాంకులు, విమానాలు, ఫిరంగులు, వేల నౌకలు, లక్షలాది టన్నుల మందుగుండు, ఇతర సైనిక ఆస్తులను అమ్మటమో లేక ధ్వంసం చేయటమో జరిగింది. అయితే రాబోయే దశాబ్దాలలో పరిస్థితులు మారే అవకాశం ఉన్నదని ప్రముఖ దౌత్యవేత్త జార్జి కెన్నన్‌ లాంటివాళ్ళు హెచ్చరించారు. ముఖ్యంగా నాటోను విస్తరించటమనే పెద్ద తప్పువల్ల భవిష్యత్తులో రష్యాతో సంబంధాలు దెబ్బతింటాయని 1997లోనే కెన్నన్‌ చెప్పాడు. అయితే అప్పట్లో అటువంటి హెచ్చరికలు అమెరికాకు అస్పష్టమైనవిగా తోచాయి. దానితో 2010కల్లా ప్రాబల్య రాజ్యాలమధ్య పోటీ నెలకొనేటప్పటికి అమెరికా, దాని మిత్రదేశాలకు తాము ఆదమరచి ఉన్నామనే విషయం అర్థమైంది.
సైనిక వ్యవస్థలో జరిగిన మార్పుల వల్ల అమెరికాకు రెండు పర్యవసానాలు ఎదురయ్యాయి. సైన్యం పరిమాణమే తగ్గిపోవటం మొదటిది, తమకు కావలసిన సైన్యాన్ని సమకూర్చుకోగల సామర్థ్యం, అలా సమకూర్చుకోదలచిన ప్పుడు కావలసిన శిక్షణను ఇవ్వగలిగిన సామర్థ్యం అమెరికాకు కొరవడటం రెండవది. ఈ పరిస్థితి సైన్యానికే కాకుండా వాయు సేనకు, నౌకాదళానికి కూడా ఎదురైంది. వివిధ దళాలకు కావలసిన దీర్ఘశ్రేణి ఆయుధాలను ఆచరణలో అందించే పరిస్థితి లేకుండా పోయింది. స్థానిక యుద్ధాలు చేయటానికి సరిపడా సైనిక యంత్రాంగం ఉండటంవేరు, ఒక ప్రధాన దేశాన్ని ఎదుర్కోవటానికి కావలసిన యంత్రాంగం వేరు. ఇప్పటి పరిస్థితుల్లో అమెరికా దగ్గర ఒక వారం రోజులపాటు ఒక ప్రధాన శత్రుదేశంతో తలపడటానికి కావలసిన ఆయుధ సంపత్తికూడా లేదనేది సుస్పష్టం.
అమెరికన్‌ వాయుసేన, సైన్యంతోపాటు నౌకాదళం కూడా యుద్ధ సన్నద్దత సామర్థ్యాన్ని కోల్పోయింది. దీనితోపాటు ఉత్పత్తి సామర్థ్యం కూడా కొరవడింది. ఒకప్పుడు వాణిజ్య నౌకా నిర్మాణంలో అమెరికా అగ్రభాగాన ఉండేది. అటువంటి అంతస్థును అమెరికా కోల్పోయింది. ఆధునిక ఉత్పత్తికి కావలసిన సౌకర్యాలుగానీ, నైపుణ్యాలుగానీ నేటి అమెరికాలో లేవు. నేడు ప్రపంచ వాణిజ్య నౌకా నిర్మాణంలో మూడు ఆసియా దేశాలకు 93శాతం వాటావుంది. ఈ మూడు దేశాలలో చైనాకు 47శాతం, దక్షిణ కొరియాకు 30శాతం, జపాన్‌ కు 17శాతం వాటావుంది. దక్షిణ కొరియా, జపాన్‌ అమెరికాకు మిత్రదేశాలైనా వాటికి వేగంగా సైనిక శక్తిని జోడించే సామర్థ్యం లేదు. ఈలోపు అమెరికా కూడా తన సైన్యానికి, వాయుసేనకు, నౌకాదళానికి కావలసిన ఆయుధాలను, యంత్ర సామాగ్రిని వేగంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోలేకపో తోంది. పైన పేర్కొన్న విషయాలతో అమెరికా సతమతమౌతోందంటే దాని ప్రత్యర్థి దేశాలలో అంతా బాగున్నట్టు కాదు. సోవియట్‌ పతనం తరువాత రష్యా సైన్యంలో జరుగుతున్న సంస్కరణలు అసమగ్రంగా ఉన్నాయి. రష్యా మిలిటరీ పరిశ్రమలో గూఢచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ, లక్ష్యాలను ఛేదించటంలో ఆధునీకరణ సమస్య ఉంది. అయితే పెద్ద ఎత్తున యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని రష్యా మిలిటరీ ఎన్నడూ విస్మరించలేదు. అందుకే రష్యావద్ద అపారమైన ఆయుధ నిల్వలు ఉన్నాయి. సైనిక ఉత్పత్తులను వేగవంతం చేసే సామర్థ్యాన్ని రష్యా కోల్పోలేదు. ఉక్రెయిన్‌ పైన నాటో కన్ను పడేదాకా పెద్ద యుద్ధం సంభవిస్తుందని రష్యా ఊహించలేదు. అయితే అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలు రష్యా యుద్ధ సన్నద్దతను తక్కువగా అంచనావేశాయి. ఈలోపు చైనా సైనిక సన్నద్దత గురించి ఊహాగానాలేగానీ వాస్తవాలు అంతగా తెలియదు. 1979లో వియత్నాంతో ఏదో తేలికపాటి యుద్ధం చేసిన చరిత్ర మాత్రమే చైనాకు ఉంది. అయినప్పటికీ చైనాకున్న సైనిక సంస్క్రుతి రష్యా నుంచి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్‌ తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవటానికి అమెరికా సహకారాన్ని తీసుకుంది. ఆ కాలంలో జర్మనీ, జపాన్‌, సోవియట్‌ యూనియన్‌, బ్రిటన్‌ తో సహా అన్నింటినీ కలిపినా అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ అంత ఉండేవి కావు. ఈ నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో మూడు దేశాలతో కలిసి అమెరికా సైనిక కూటమి ఉంది. అయితే నేటి అమెరికా పారిశ్రామిక సామర్థ్యం చైనాకంటే బలహీనంగా ఉంది. ఫైనాన్షియల్‌, సాంకేతిక రంగాలలో అమెరికా ఆధిపత్యానికి చైనా నుంచి సవాళ్ళు ఎదురవుతున్నాయి. అంటే 1940వ దశకంలోని జర్మనీకంటే కూడా చైనా అమెరికాకు బలమైన వ్యూహాత్మక ప్రత్యర్థిగా ఉంది. కాబట్టి నేటి అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా అంతకుముందటిలాగా ఆధిపత్యాన్ని చెలాయించటం అంత తేలిక కాదనేది సుస్పష్టం.

Spread the love