మోడీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ అసహనం.. నోటీసులు జారీ

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎన్నికల సంఘం  తాజాగా నోటీసులు ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదులు రావడంతో రెండు పార్టీలకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు పంపింది ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని ఈసీ ఆదేశించింది. ఈ సందర్భంగా మోడీ, రాహుల్‌ ప్రసంగాలపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరిస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, అది పార్టీ బాధ్యత అని తెలిపింది. ముఖ్యంగా స్టార్‌ క్యాంపెయినర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉన్నత స్థాయిల్లో ఉన్న వ్యక్తుల ప్రచార ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంటుందని ఈసీ తన నోటీసుల్లో పేర్కొంది.

Spread the love