రాయపాటి ఇండ్లపై ఈడీి దాడులు

ED raids on Rayapati houses– గుంటూరు, హైదరాబాద్‌లో ట్రాన్స్‌ట్రారు డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు
గుంటూరు : బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన కేసులో ట్రాన్స్‌ట్రారు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపై ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు మంగళవారం గుంటూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. గుంటూరు లక్ష్మీపురంలోని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు నివాసంలో ఇడి బృందం పలు రికార్డులను పరిశీలించింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని రాయపాటి నివాసం, మరో డైరెక్టర్‌ మలినేని సాంబశివరావు నివాసంలో కూడా తనిఖీలు జరిగాయి. మొత్తం 15 బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. రుణాల ఎగవేత కేసులో సిబిఐ ఇప్పటికే రాయపాటితోపాటు పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇడి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 13 రకాల కంపెనీల పేరుతో రూ.9 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నారని, ఒక అవసరం కోసం రుణం తీసుకుని మరో అవసరం కోసం వినియోగించారని, కొన్ని డొల్ల కంపెనీలను రికార్డుల్లో చూపించి రుణాలు తీసుకుని ఆ తర్వాత ఆ సొమ్మును వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. రుణాలు, వడ్డీతో సహా ప్రస్తుతం రూ.36 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. 2001లో రాయపాటి సాంబశివరావు నేతృత్వంలో ట్రాన్స్‌ట్రారు కంపెనీ ప్రారంభమైంది. 2017 వరకు డైరెక్టరుగా ఉన్న మలినేని సాంబశివరావు ఆధ్వర్యంలో మనీ లాండరింగ్‌ జరిగినట్టు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దాదాపు 13 బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేతకు పాల్పడిన కేసులో ప్రస్తుతం ఇడి దర్యాప్తు చేస్తోంది. ఈ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ అయినట్టు ఇడి అధికారులు గుర్తించారు.

Spread the love