ప్రతిగింజనూ కొనుగోలు చేయాలి

మెదక్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి
నవతెలంగాణ- గజ్వేల్‌
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మెదక్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌ మండలంలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ సిబ్బందికి సూచించారు. రైతులు అసలే నష్టపోయి ఉన్నారని ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావు ప్రత్యేక దష్టితో చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకున్నామని వాటి ద్వారా కొనుగోలు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా అధికార సిబ్బంది సహకరించాలని ఆయన సూచించారు. గోన సంచులు లేని చోట వెంటనే తెప్పించాలని రైస్‌ మిల్లర్స్‌ పూర్తిస్థాయిలో రైతులకు సాయం చేయాలని ఆయన కోరారు. రైతు వడగళ్లతో నష్టపోయి ఉన్నారని మార్కెట్‌ తెచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love