సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

నవతెలంగాణ/తూప్రాన్‌ రూరల్‌ (మనోహరాబాద్‌)
ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ మోసాలు సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, గుర్తుతెలియని వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని తూప్రాన్‌ సీఐ శ్రీదర్‌ సూచించారు. గురువారం ఉదయం మండలంలోని కూచారం గ్రామంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కార్డెన్‌ సెర్చ్‌లో ఎలాంటి ధృవ పత్రాలు లేని 45 బైకులు, 7 ఆటోలను సీజ్‌ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వారు ఫోన్‌లో అనుకోకుండా డబ్బులు పడ్డాయని ఓటీపీ చెప్పాలంటూ నమ్మించే ప్రయత్నాలు చేస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగ ుండా ప్రతి ఒక్కరూ నిబందనలను పాటించాలని సూచించారు. చిన్న పిల్లలకు వాహనాలను ఇస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే నేరమే అని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కలిగి ఉండాలని తెలిపారు. గ్రామంలో గుర్తు తెలియని వారి నుండి రక్షణ కోసం తప్పని సరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. కార్యక్రమంలో తూప్రాన్‌ సర్కిల్‌ నుండి ముగ్గురు ఎస్‌ఐలు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డి నరేష్‌ముదిరాజ్‌తో పాటు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love