‘పరీక్షా’ కాలం!

ప్రభుత్వాలకు పరీక్షా కాలం ఇంకో ఆరు నెలలో, ఏడాదో ఉంది. కానీ ఇంటర్‌, పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కాలం చేరువైంది. ఈ సంక్లిష్ట సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. అన్ని తరగతులకు వార్షిక పరీక్షలు అయితే, పదో తరగతికి, ఇంటర్‌ విద్యార్థులకు బోర్డు పరీక్షలు. ఆ తర్వాత ఉన్నత, వృత్తి విద్యా చదువులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయి. నేటి విద్యార్థులకు రేపటి భవిష్యత్తును నిర్ణయించేవి కాబట్టి వారు ఒత్తిడికి లోనవడం సహజం. పరీక్షా కాలం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్‌ భరించలేకపోతున్నారు. చదివింది గుర్తుకు రావటం లేదనీ, మర్చిపోతున్నాం అంటూ టెలీ మానస్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14416కు ఇంటర్‌ విద్యార్థుల ఫోన్ల వెల్లువ పెరిగిపోతోంది. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తున్నది. గత అక్టోబర్‌ నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60వేల ఫోన్లు వచ్చినట్టు సమాచారం. అందులో అత్యధికులకు పరీక్షలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. ఆ తర్వాత మానవ సంబంధాలు (హ్యూమన్‌ రిలేషన్షిప్‌), ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుండి ఇంటర్‌ పరీక్షలున్నాయి. ఈ పరీక్షల్లో మొత్తం 9.51లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే పదవ తరగతి పరీక్షల కోసం కూడా విద్యార్థులు సిద్ధమవుతున్నారు. టెన్షన్‌ నివారణకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్‌ చేస్తున్న వారిలో 90శాతం పైగా ఎంపీసీ, బైపిసి విద్యార్థులే ఉన్నారు. పరీక్షల ఒత్తిడి ఒక వైపైతే, ఆ తర్వాత ఉండే జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌, నీట్‌, ఎంసెట్లలో అర్హత సాధిస్తామా! మంచి ర్యాంకు వస్తుందా లేదా! అనే ఒత్తిడి ఈ రెండు గ్రూపుల విద్యార్థుల్లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు తల్లిదండ్రులు.. విద్యార్థుల స్థాయిని తెలుసుకోకుండానే వారికి భారీ ఫీజులు చెల్లించి కార్పొరేట్‌, ప్రయివేట్‌ కాలేజీల్లో చేర్పించడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తున్నది. ఈ టెన్షన్‌ అతిగా పెంచుకుంటూ పోతే, ప్రభావం మన శరీరం, మెదడు మీద పడుతుంది. కాళ్లు వణుకుతాయి. ప్రశ్న పత్రంలో ప్రశ్నలు ఎన్నడూ కనీ, విననివిగా కనిపిస్తాయి. ఏదీ గుర్తుకు రాదు. ఇక్కడ మనం చేయాల్సింది దాన్ని ఎలా అధిగమించాలి అనే మార్గాలను వెతకడం. చాలామంది మానసిక నిపుణుల సూచనలను. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాలకులు తెలుసుకోవాలి. నిజానికి వీరు భయపడి విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేంత తీవ్ర పరిస్థితి పరీక్షల్లో, పత్రాల్లో ఉండదు. అన్నీ చదువుకున్న పాఠ్యాంశాలేనని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవద్దు, అర్ధరాత్రి వరకు చదవొద్దు. ఇలా చదివితే బుర్రకి ఎక్కదు గుర్తుకు రాదు. ప్రతి గంటకు సుమారు 15 నిమిషాలు విరామం తీసుకోవాలి. మధ్య మధ్యలో వ్యాయామం, యోగా లాంటివి చేయాలి. చదివిన అంశాలపై ముఖ్యమైన పాయింట్లు నోట్‌ చేసుకొని తరచూ గుర్తు చేసుకోవాలి. పరీక్షా కేంద్ర మేమీ యుద్ధభూమి కాదు! పరీక్షలంటే యుద్ధం చేయడం కాదు? ప్రశాంతంగా ఏకాగ్రత కోల్పోకుండా చదువుకున్న అంశాలు గుర్తు చేసుకుని రాయాలి. వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏకాగ్రత చదువుల్లో ఎంతో అవసరం ఉందంటున్నారు. అది లేకుండా ఎన్ని గంటలు చదివినా బుర్రకెక్కదని చెప్తున్నారు. మనసుని చదువుల మీద కేంద్రీకృతం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు. ఎప్పటి పాఠం అప్పుడే చదివే వారికి పరీక్షల సమయంలో ఏ టెన్షన్‌ ఉండదని పెద్దలు, పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ తరచూ తీసుకోవడం, రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే? తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు తెచ్చుకోవడం. విద్యార్థులకు ఫ్యాన్లు, రాయడానికి వీలుగా బెంచీలు, కుర్చీలు, గాలి, వెలుతురు, నీరు, టాయిలెట్లు, రవాణా, విద్యుత్తు సౌకర్యాల కొరత రాకుండా చూడాలి. ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యా కేంద్రాలు విద్యార్థులకు హాల్‌ టికెట్స్‌ ఇవ్వడంలో రుసుముల పేరుతో ఆలస్యం చేయడం లాంటి సంఘటనలు లేకుండా వారికి ముందే హాల్‌ టికెట్‌ పంపిణీ చేసేలా చూడాలి. పరీక్షలు సమీపంలో ఉన్నందున విదార్థులు ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాలకులపై ఉందని గమనించాలి. ఈ పరీక్షలు విద్యార్థులకు మాత్రమే కాదు? అవి నిర్వహించే యాజమాన్యా లకు, అధికారులకు, బోధించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పాలకులకు కూడా పరీక్ష కాలమేనని గ్రహించాలి. రోజూ కాలేజీకో, బడికో వెళ్లినట్లే సహజంగా కొంచెం ప్రణాళికతో పరీక్షా కేంద్రాలకు వెళ్లాలి. అంతకు మించిన ఒత్తిడి అనవసరం. పరీక్షల్లో చక్కగా చదివేసిన వాటినే అలవోకగా రాసేయవచ్చు. విద్యార్థులకు ఇంకో అతి విలువైన మాట.. మార్కులు ర్యాంకులే ప్రతిభకు కొలమానం కాదు. పరీక్షలు రాయబోయే ఏ ఒక్క విద్యార్థి నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. ఆత్మ విశ్వాసం కన్న గొప్ప ఆస్తి లేదు. ఆల్‌ ది బెస్ట్‌..
– మేకిరి దామోదర్‌
9573666650

Spread the love