సన్‌రైజర్స్‌కు ఎదురుందా?

సన్‌రైజర్స్‌కు ఎదురుందా?– నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్‌ ఢీ
– రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-న్యూఢిల్లీ 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరు వినగానే అందరికీ మంచి బౌలింగ్‌ జట్టు గుర్తొచ్చేది. 2024 ఐపీఎల్‌ సీజన్లో పాట్‌ కమిన్స్‌ సారథ్యంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ బ్రాండ్‌ను పూర్తిగా చెరిపేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంటే అరాచక బ్యాటింగ్‌కు చిరునామాగా మారింది. ఉప్పల్‌లో ముంబయి ఇండియన్స్‌పై 277, చిన్నస్వామిలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌పై 287 పరుగులతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డును సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియం వేదికగా రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో విజయంపై కన్నేసి నేడు బరిలోకి దిగుతుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పూర్తి భిన్నమైన వ్యూహంతో బరిలోకి దిగుతుంది. బ్యాట్‌తో, బంతితో పవర్‌ప్లేలో ఎదురులేని ఆధిపత్యం సాధించటమే సన్‌రైజర్స్‌ తొలి క్ష్యంగా కనిపిస్తుంది. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు సన్‌రైజర్స్‌ ఎందుకైనా వెనుకాడటం లేదు. వికెట్లు పడినా ఎదురుదాడి మంత్ర వీడటం లేదు. ట్రావిశ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఎడెన్‌ మార్‌క్రామ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలకు తోడుగా ఇప్పుడు అబ్దుల్‌ సమద్‌ సైతం ఫామ్‌లోకి వచ్చాడు. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు అందరూ స్ట్రయిక్‌రేట్‌ 200తో పరుగులు సాధిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ అలవోకగా భారీ స్కోర్లు నమోదు చేస్తుంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు లెఫ్ట్‌ హ్యాండర్లపై మంచి రికార్డుంది. నేడు డెవిడ్‌ వార్నర్‌, రిషబ్‌ పంత్‌లతో కమిన్స్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరం సైతం గత రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదుంది. పృథ్వీ షా, రిషబ్‌ పంత్‌లకు తోడు జేక్‌ ఫ్రేసర్‌, అభిషేక్‌ పోరెల్‌ దంచికొడుతున్నారు. బంతితో ఇషాంత్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌లు అంచనాలు అందుకుంటున్నారు. హాట్‌ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.

Spread the love