ఆద్యంతం వినోదభరితం

ఆద్యంతం వినోదభరితంఅల్లరి నరేష్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రైటర్‌ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్‌ అందించారు. అల్లరి నరేష్‌ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ
సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈనెల 3న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో డైలాగ్‌ రైటర్‌ అబ్బూరి రవి మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ కథ దర్శకుడు మల్లిది. ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్‌ అవ్వడం అంటే ఉద్యోగం రావడం, పెళ్లి కావడం. అయితే ఇప్పుడు పెళ్లి విషయంలో యావరేజ్‌ ఏజ్‌ మారిపోతుంది. ఒకప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకునేవారు. ఇప్పుడు ఎప్పుడు చేసుకుంటారో ఎవరికీ తెలీదు. అందరూ సెటిల్మెంట్‌ గురించే మాట్లాడతారు. ఈ సినిమాలో ఒక మాట వుంటుంది. ‘సెటిల్మెంట్‌ అంటే ఉద్యోగం, పెళ్లి కాదు.. మనకి ఒక అవసరం వచ్చినపుడు పక్కవాడి దగ్గర చేయి చాచకపోవడం”. ఇప్పుడు కొన్నింటికి అర్ధాలు మారిపోయాయి. పెళ్లి అనేది పూర్తిగా శాస్త్రోక్తమైనది. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక సైన్స్‌ వుంది. జీలకర్ర బెల్లంలో కరెంట్‌ ప్రవహిస్తుంది. ఇద్దరి ఎనర్జీని బ్యాలెన్స్‌ చేసే ప్రక్రియ అది. ఆ సమయంలో ఆత్మ స్థానాన్ని చూడామని చెబుతారు. ఇంత శాస్త్రం వున్న పెళ్లిని లెక్కలేకుండా చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం. నిజానికి ఇది సీరియస్‌ టాపిక్‌. ఇలాంటి సబ్జెక్ట్‌ని వినోదాత్మకంగా చెబుతూనే ఎమోషనల్‌ కనెక్ట్‌ చేసేలా చూపించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా సందేశం ఇవ్వడం లాంటిది ఉండదు. ఈవీవీ క్లాసిక్‌ సినిమా టైటిల్‌లో నరేష్‌ అద్భుతంగా నటించారు’ అని చెప్పారు.

Spread the love