28 నుంచి గ్రామసభలు

– రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇండ్ల లబ్దిదారుల ఎంపిక
– తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలి
– కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు
– పార్టీ విజయానికి కృషి చేసిన, కార్యకర్తలు, నాయకులు, అగ్రనేతలకు ధన్యవాదాలు : టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తీర్మానం
– అసెంబ్లీ సమావేశాలు, లోక్‌సభ ఎన్నికలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. రేషన్‌ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల కోసం లబ్దిదారులను ఆయా సభల ద్వారానే ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇంచార్జ్‌ మానిక్‌ రావ్‌ ఠాక్రే అధ్యక్షతన నిర్వహించిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణ మద్దతు పలికిన ప్రజలకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు, ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అగ్రనాయకులకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనీ, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మానిక్‌ రావు ఠాక్రే సూచించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో షబ్బీర్‌ అలీ వివరాలను వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ పీఏసీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాకు రుణపడి ఉంటామన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సమావేశం చర్చించిందనీ, వాటి వివరాలను సీఎం అసెంబ్లీలో వెల్లడిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగపూర్‌లో ఈ నెల 28న జరిగే వేడుకకు రాష్ట్రం నుంచి 50 వేల మంది తరలి వెళతారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి వివరించగా, సాగునీటి అవకతవకలపై ఉత్తమ్‌ వివరించారని చెప్పారు. ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ఖర్చు చేసినా ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. విద్యుత్తు, ఆర్థికరంగం, సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు. పార్లమెంటు స్థానాలకు మంత్రులను ఇంఛార్జీలుగా నియమించినట్టు చెప్పారు. నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పారన్నారు. రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామనీ, మిగతా నాలుగు గ్యారంటీలను త్వరలోనే అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
రేవంత్‌ కీలక వ్యాఖ్యలు
రాబోయే నెల రోజుల్లో నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పీఏసీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగాలన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేని చోట సంక్షేమ పథకాలను బీ.ఫామ్‌ అందుకున్న నాయకుని ద్వారానే వారికి చేరవేయాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ సీట్ల సంగతి అధిష్టానం చూసుకుంటుందని స్పష్టతనిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు నెల ముందే రావచ్చన్నారు. అభ్యర్థుల ప్రకటన సంక్రాంతి తర్వాత ఉంటుందని రేవంత్‌ చెప్పినట్టు తెలిసింది.
కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు
ఏఐసీసీ అబ్జర్వర్లను నియమించింది
వరంగల్‌ – రవీంద్ర దాల్వి, జహిరాబాద్‌ – మేయప్పన్‌
నాగర్‌కర్నూలు – పీవీ మోహన్‌, ఖమ్మం – ఆరీఫ్‌ నసీంఖాన్‌
నల్లగొండ – రాజశేఖర్‌ పాటిల్‌, పెద్దపల్లి – మోహన్‌ జోషి
మల్కాజ్‌గిరి – రిజ్వాన్‌ అర్షద్‌, మెదక్‌ – యూబీ వెంకటేశ్‌
సికింద్రాబాద్‌ – రూబీ మనోహరన్‌, హైదరాబాద్‌ – భారు జగదప్‌
భువనగిరి – శ్రీనివాస్‌, మహబూబాబాద్‌ – శివశంకర్‌రెడ్డి
ఆదిలాబాద్‌ – ప్రకాశ్‌ రాథోడ్‌, నిజామాబాద్‌ – అంజలీ నింబాల్కర్‌
మహబూబ్‌నగర్‌ – మోహన్‌ కుమార్‌ మంగళం
చేవెళ్ల – ఎం.కె. విష్ణుప్రసాద్‌, కరీంనగర్‌ – క్రిష్టోఫర్‌ తిలక్‌

కాంగ్రెస్‌ ఇన్‌చార్జీలు వీరే
వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ అధిష్ఠానం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ నియో జకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ఆ పార్టీ నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇన్‌ఛార్జిలుగా నియమితులైన వారిలో ముఖ్యమంత్రితోపాటు దాదాపు అందరూ మంత్రులే ఉన్నారు.
చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ – రేవంత్‌ రెడ్డి
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ – భట్టి
నాగర్‌కర్నూల్‌ – జూపల్లి కృష్ణారావు
నల్లగొండ – ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వరంగల్‌ – కొండా సురేఖ
మహబూబాబాద్‌, ఖమ్మం – పొంగులేటి
ఆదిలాబాద్‌ – సీతక్క
పెద్దపల్లి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్‌ – పొన్నం ప్రభాకర్‌
నిజామాబాద్‌ – జీవన్‌ రెడ్డి
జహీరాబాద్‌ – పి.సుదర్శన్‌రెడ్డి
మెదక్‌ – దామోదర రాజనర్సింహ
మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు

Spread the love